పరిశ్రమలకు విద్యుత్తు విరామాన్ని ఈ నెల 15 వరకు డిస్కంలు పొడిగించాయి. రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారేలా ఉండటంతో విద్యుత్తు విరామాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. దీంతో ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులతో సతమతం అవుతున్న పరిశ్రమలు మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోతాయని నిర్వాహకులు చెబుతున్నారు. కొవిడ్ తర్వాత మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఉత్పత్తి పెంచుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో సుమారు దశాబ్ద కాలం తర్వాత పరిశ్రమలపై విద్యుత్తు కోతల ప్రభావం పడింది. అవసరమైన విద్యుత్తులో 50% తగ్గించడంతో పరిశ్రమల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారంతో పాటు అదనంగా మరో రోజు విద్యుత్తు విరామాన్ని పాటించాలి. అంతరాయం లేకుండా పని చేసే పరిశ్రమలు (24 గంటలూ) వినియోగించే విద్యుత్తులో 50%.. షిఫ్టుల వారీగా పనిచేసే పరిశ్రమలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్య ఒకే షిఫ్టు కింద పని చేయాలన్న నిబంధనలను డిస్కంలు అమలు చేస్తున్నాయి. ఫెర్రో అల్లాయిస్, టెక్స్‌టైల్, సిమెంటు, స్టీలు పరిశ్రమల ఉత్పత్తి దెబ్బతిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్దేశిత వ్యవధిలో ఆర్డర్లు అందించడం సాధ్యం కావటం లేదన్నారు.