తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. ముఖ్యంగా చిన్నారులపై పంజా విసురుతోంది. హైదరాబాద్ నిలోఫర్‌లో 9 చిన్నపిల్లల యూనిట్లు చిన్నారులతో నిండిపోయాయి. ఎన్‌ఐసీయూ(NICU)లో 250 మంది వరకు పిల్లలు చికిత్స పొందుతున్నారు. నెల నుంచి 12 ఏళ్లలోపు దాదాపు 700-750 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 30-40 శాతం మందిలో డెంగీ లక్షణాలు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రోజూ వెయ్యి మందికి తక్కువ కాకుండా ఓపీ ఉంటోంది. గాంధీ ఆస్పత్రిలోనూ డెంగీతో చిన్నారులు చేరుతున్నారు. గత రెండు వారాల్లో 80 మంది వరకు చిన్న పిల్లలు చికిత్స తీసుకున్నారు. పరిస్థితి విషమించి 3, 8, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురతో పాటు ఆరేళ్ల బాలిక కన్నుమూశారు. కొందరి పిల్లల్లో డెంగీతో పాటు కరోనా, టైఫాయిడ్, స్క్రబ్‌టైపస్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
నీరు నిల్వల కారణంగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. పలు పాఠశాలల వద్ద పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుండటంతో కొందరు చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు. వీధులు, కాలనీల్లో మురుగునీరు, చెత్త డంపింగ్ ప్రాంతాలు దోమలు ప్రబలడానికి కారణమవుతున్నాయి. డెంగీకి కారణమయ్యే టైగర్ దోమ పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ క్రమంలో బడులకు, ఆడుకోవటానికి వెళుతున్న చిన్నారులు దోమ కాటుకు గురౌతున్నారు.
పిల్లల్లో డెంగీతో పాటు కరోనా, మలేరియా, టైఫాయిడ్, స్క్రబ్‌టైపస్ జ్వరాలు పెరుగుతున్నాయి. ఆఖరి నిమిషంలో ఆసుపత్రులకు రావడంతో కొన్నిసార్లు పరిస్థితి విషమంగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు.