ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ అమ్మాయిలను చూస్తే.. కంటే కూతుర్నే కనాలి.. అనిపిస్తుంది! - daughters helped mother to recover in sangareddy

పేగుతెంచుకుని జన్మనిచ్చిన తల్లికి... ఆ కుమార్తెలు పునర్జన్మనిచ్చారు. నవమాసాలు మోసిన తల్లి అచేతనంగా పడిపోతే తల్లడిల్లిన కూతుళ్లు... ఏడాదిపాటు మాతృమూర్తిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నాన్న లేని తమను అన్నీ తానై పెంచిన తల్లిని మామూలు మనిషిగా మార్చగలిగారు.

daughters-saved-their-mother
daughters-saved-their-mother

By

Published : Nov 25, 2020, 10:30 AM IST

ఈ అమ్మాయిలను చూస్తే.. కంటే కూతుర్నే కనాలి.. అనిపిస్తుంది!

జన్మనిచ్చిన కన్నతల్లికే పునర్జన్మనిచ్చారు ఈ కుమార్తెలు. రోడ్డు ప్రమాదంలో అచేతనంగా మారిన తల్లిని.. అహర్నిషలు శ్రమించి మామూలు స్థితికి తీసుకొచ్చారు. తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేమని చదువులు పక్కనబెట్టి ఏడాదిపాటు సపర్యలు చేశారు. తన బిడ్డలే తల్లిగా మారి చేసిన సేవలతో కోలుకున్న మాతృమూర్తి... ఇప్పుడు తన బిడ్డలను చూసి గర్విస్తోంది.

మాతృమూర్తికి మరోజన్మ

తెలంగాణలోని సంగారెడ్డి పట్టాణానికి చెందిన రహేలకు ఇద్దరు కుమార్తెలు. అనూష, వరమ్మలు పుట్టిన కొన్నాళ్లకే భర్త కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. మిషన్​ కుడుతూ పిల్లల్ని బాగా చదివించాలని రహేల తపనపడేది. గతేడాది అక్టోబర్‌ 21న ద్విచక్ర వాహనంపై కూతుర్ని కళాశాలలో దింపి వస్తుండగా... రోడ్డు ప్రమాదం జరిగింది. రహేల అచేతనంగా మారింది. తల్లిని మళ్లీ మామూలు మనిషిగా చూడాలని కూతుళ్లిద్దరూ ఎంతగానో ప్రయత్నించారు. డబ్బుల్లేక నానా అవస్థలు పడ్డారు. వారి ఆవేదనను ఈటీవీ - ఈటీవీ భారత్ అందరికీ తెలియజేసింది. మంత్రి హరీశ్‌రావు స్పందించి రహేలకు మెరుగైన వైద్యం అందేలా చొరవ తీసుకున్నారు. తల్లి మామూలు మనిషిగా మారితే చాలని కూతుళ్లిద్దరూ చంటిబిడ్డలా కాపాడుకున్నారు. అన్నం తినలేని స్థితిలో ముక్కు ద్వారా ద్రవ పదార్థాలు అందించారు. ఏడాది శ్రమతో అమ్మకు మరోజన్మను ప్రసాదించారు.

పుత్రికోత్సాహం

ఇటీవల పూర్తిగా కోలుకున్న రహేలా తన బిడ్డల్ని చూసి గర్విస్తోంది. కూతుళ్లు పడిన ఆవేదన, కష్టాన్ని గుర్తుచేస్తే రహేల కళ్లు పుత్రికోత్సాహంతో వర్షిస్తున్నాయి. కష్టపడి వారిని మంచి చదువులు చదివిస్తానని గర్వంగా చెబుతోంది. అమ్మకే అమ్మలై ..మాతృమూర్తికి పునర్జన్మనిచ్చి... కంటే కూతుర్నే కనాలి అన్న మాటను నిజం చేసిన అనూష,వరమ్మలను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

ఇదీ చూడండి:

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్​ హత్య కేసులో భార్య హస్తం

ABOUT THE AUTHOR

...view details