తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు.. తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వారి నుంచి 25 కిలోల బంగారం, రూ.93వేలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముత్తూట్ కార్యాలయంలోనికి కస్టమర్లుగా వెళ్లి రెక్కీ నిర్వహించారని, ఆ తర్వాత సిబ్బందిని ఆయుధాలతో బెదిరించారని సజ్జనార్ చెప్పారు.
'ముత్తూట్ చోరీ' కేసులో ఏడుగురి అరెస్టు - Muthoot Finance Robbery case
తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ బంగారం చోరీ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు.. తెలంగాణలోని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, యూపీకి చెందిన వారిగా గుర్తించినట్లు వెల్లడించారు.
దోపిడీ ముఠా ఉపయోగించిన లారీ, కంటైనర్, సుమో, 13 సెల్ఫోన్లు, 7 పిస్తోళ్లు, 10 మ్యాగజైన్లు, 97 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనపరుచుకున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. హోసూరు పోలీసుల సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టిన తమకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ జాతీయ రహదారి వద్ద దోపిడీ దొంగల వాహనం తారసపడినట్లు సజ్జనార్ వెల్లడించారు. తమిళనాడు పోలీసులు పంపిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మూడు కమిషనరేట్ల మధ్య సమన్వయం వల్లే పెద్ద చోరీ ముఠాను పట్టుకోగలిగామని చెప్పారు.
- సంబంధిత కథనం :తమిళనాడులో దోచారు.. సైబరాబాద్‌లో చిక్కారు...