ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా మృతదేహాల తరలింపులో పాటించాల్సిన మార్గనిర్దేశాలు

శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ మృతులను జేసీబీ తొట్టెలో, ట్రాక్టర్​లో తరలించిన అమానవీయ ఘటన అందర్నీ కలచివేసింది. కరోనా వైరస్ కారణంగా మరణించిన వారికి కనీసం శ్మశానాల్లో అంత్యక్రియలు చేసేందుకు అనుమతించని ఘటనలు కోకొల్లలు. కరోనా మృతి చెందిన వారికి అంతిమ సంస్కారాలు ఎలా నిర్వహించాలో కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. స్థానిక అధికారులు వీటిని పాటించడం లేదన్నది శ్రీకాకుళం ఘటనలతో మరోసారి రుజువైంది.

By

Published : Jun 27, 2020, 10:39 PM IST

Updated : Jun 27, 2020, 11:02 PM IST

కరోనా మృతదేహాల తరలింపులో పాటించాల్సిన మార్గనిర్దేశాలు
కరోనా మృతదేహాల తరలింపులో పాటించాల్సిన మార్గనిర్దేశాలు

కొవిడ్ కారణంగా మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను జేసీబీ తొట్టెలో, పంచాయతీ చెత్త ట్రాక్టర్​లో తరలించిన ఘటనలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఘటనలపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. కొవిడ్ మృతుల పట్ల కేంద్ర హోంశాఖ జారీ చేసిన విధివిధానాలను ప్రభుత్వం యంత్రాంగం పాటించాల్సి ఉంది. కరోనా కారణంగా తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు కాసింతైన మానసిక తృప్తి లభించేలా మృతదేహాల అంత్యక్రియల్లో జాగ్రత్తలు చేపట్టాల్సిఉంది.

కరోనాతో మరణించిన వారి దహన సంస్కారాలకూ శ్మశానవాటికల్లో చోటు దక్కనిస్థితి నెలకొంది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నా అపోహల కారణంగా ప్రభుత్వ సిబ్బందే నిర్లక్ష్యంగా వ్యవహరించటం పరిస్థితికి అద్దంపడుతోంది. కొవిడ్ కారణంగా మృతి చెందితే మృతదేహాల నిర్వహణ, తరలింపు, అంత్యక్రియలకు సంబంధించి ప్రత్యేకమైన మార్గదర్శకాలను కేంద్రం నిర్దేశించింది.

కరోనా మృతదేహాల తరలింపులో పాటించాల్సిన మార్గనిర్దేశాలు

మృతదేహాల తరలింపు మార్గనిర్దేశాలు

  • ఏకాంత గదిలో మరణిస్తే... మృతదేహాన్ని పరిశీలించేప్పుడు తడి అంటని యాప్రాన్‌, గ్లోవ్స్‌, మాస్క్‌లు ఉపయోగించాలి.
  • మృతదేహానికి ట్యూబులు, డ్రైన్లు వంటివి ఉంటే తప్పనిసరిగా తొలగించాలి.
  • దేహం నుంచి ద్రవాలేవీ బయటకు రాకుండా నోరు, నాసికారంధ్రాలు సరిగా మూసివేయాలి.
  • మృతదేహాన్ని లీక్‌-ప్రూఫ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఉంచాలి. అలాగే ఆ బ్యాగును 1 శాతం హైపోక్లోరైట్‌తో శుభ్రపరచాలి.
  • రోగి కోసం వాడిన వస్త్రాలన్నింటినీ బయోహజార్డ్‌ బ్యాగ్‌లో ఉంచాలి.
  • వ్యక్తి మరణించిన ఏకాంత గదిలో నేల, మంచం, రెయిలింగ్స్‌, పక్క టేబుళ్లు, స్టాండ్లన్నింటినీ 1% సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రపరచాలి.
  • ఎట్టిపరిస్థితుల్లోనూ మృతదేహానికి ఎంబామింగ్‌ చేయడానికి అనుమతివ్వకూడదు.

శవపరీక్ష లేకుండా...

మృతదేహాన్ని తరలించే సిబ్బంది సర్జికల్‌ మాస్క్‌, గ్లోవ్స్‌తోపాటు ఇతర జాగ్రత్తలన్నీ పాటించాలని కూడా స్పష్టం చేసింది. మృతదేహాన్ని తరలించిన వాహనాన్ని కూడా 1శాతం సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలని... సాధ్యమైనంత వరకూ శవపరీక్ష లేకుండా చూడాలని పేర్కోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహాన్ని పూర్తిగా సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రంచేసి బ్యాగ్‌లో పెట్టాలని స్పష్టం చేసింది. అంత్యక్రియలకు అత్యంత సన్నిహితులు మాత్రమే అనుమతించేలా మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. దేహాన్ని ముట్టుకోకుండా మతపరమైన ప్రక్రియలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం మార్గదర్శకాలు తెలుపుతున్నాయి. మృతదేహానికి స్నానం చేయించడం, తాకడం, ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం లాంటివి చేయకూడదని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

బూడిద నుంచి ఇన్​ఫెక్షన్​ సోకదు

కొన్ని మతపరమైన సంప్రదాయాల్లో భాగంగా అత్యంత లోతులో మృతదేహాన్ని పూడ్చి పెట్టటం లేదా ఎలక్ట్రికల్ క్రిమేషన్ ఛాంబర్​లో అంత్యక్రియలు నిర్వహించాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. అయితే బూడిద నుంచి ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రావని స్పష్టం చేసింది. అయితే మృతదేహాలను తరలించే విషయంలో ప్రత్యేక వాహనంలో తరలించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నా శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ, సోంపేటల్లో జేసీబీ తొట్టె, పంచాయతీ చెత్త ట్రాక్టర్లలో బహిరంగంగా తరలించటం తీవ్ర విమర్శలకు తావివ్వటంతో పాటు మార్గదర్శకాలను తూట్లు పొడిచేలా యంత్రాంగం వ్యవహరించిందన్నది నిపుణుల అభిప్రాయం.

ఇదీ చదవండి :పలాసలో అమానవీయ ఘటన.. సీఎంవో తీవ్ర ఆగ్రహం

Last Updated : Jun 27, 2020, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details