కరోనా ఊహకందని రీతిలో విస్తరిస్తోంది. హైదరాబాద్ గాంధీనగర్ ఠాణా పరిధిలో ఒకే ఇంట్లో నివసిస్తున్న యువతి, యువకుడు ఇటీవల వైరస్ బారినపడ్డారు. అతడు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతుండగా, ఆమె ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం యువకుడికి దగ్గు, జలుబు రావడం వల్ల గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. అతడి నమూనాలు పరీక్షించగా, శనివారం పాజిటివ్ అని ఫలితం వచ్చింది. అదేరోజు యువతికి కూడా పరీక్షలు చేయగా, ఆమెకూ పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.
మూలాలపై పోలీసుల ఆరా..
లాక్‌డౌన్ కారణంగా శిక్షణ సంస్థలు మూతపడడం వల్ల వీరిద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు. నిత్యావసర వస్తువులు కొనేందుకు మాత్రమే యువకుడు బయటకు వెళ్లి వస్తున్నాడు. వారుంటున్న ఇంటికి సమీపంలోనే కూరగాయలు, పాల కేంద్రం ఉన్నాయి. రెండు రోజులకోసారి పాలు, కూరగాయలకు వెళ్లేవాడని పోలీసు విచారణలో తేలడం వల్ల కూరగాయల వ్యాపారిని, పాలబూత్ నిర్వాహకుడిని ప్రశ్నించారు.