తెలంగాణలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన సమీక్షలో అధికారులు వెల్లడించారు. బుధవారం కరోనాతో ముగ్గురు మృతిచెందినట్లు తెలిపారు. ఆ రాష్ట్రంలో మొత్తం 127కు కరోనా కేసులు పెరిగాయి. ఇప్పటివరకు కరోనాతో 9 మంది మృతి చెందారు. చనిపోయిన ముగ్గురు కూడా దిల్లీలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిగానే తేలింది. గతంలో మరణించిన వారిలోనూ ఎక్కువగా మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారే.
తెలంగాణలో ఒక్కరోజే 30 కొత్త కేసులు
తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఆ రాష్ట్రంలో వైరస్ పీడితుల సంఖ్య 127కు చేరుకుంది. బుధవారం కొవిడ్-19తో హైదరాబాద్ గాంధీలో ఇద్దరు, యశోధ ఆస్పత్రిలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ముగ్గురు కూడా దిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిగా గుర్తించారు. ఇప్పటివరకు తెలంగాణలో ఈ మహమ్మారి బారినపడి 9 మంది చనిపోయారు.
మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరి కొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు. అలాంటి వారిలో ఎవరి పరిస్థితి కూడా ఆందోళన కరంగా లేదు. ఎవరూ చనిపోలేదు. అయితే కొద్ది రోజులుగా తెలంగాణలో నమోదవుతన్న పాజిటివ్ కేసులన్నీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారివిగానే తేలాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మర్కజ్ వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఇదీ చూడండి:రాష్ట్రంలో 111 కరోనా కేసులు... ఒక్క రోజే 67 మందికి పాజిటివ్