ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీసీకి కరోనా కష్టం.. వెలవెలబోతున్న బస్సులు

కొవిడ్‌ కారణంగా ఆర్టీసీ ప్రయాణాలు పడిపోయాయి. బస్సు ప్రయాణం చేయాలంటే జనం జంకుతున్నారు. ఏసీ బస్సుల పరిస్థితి..మరీ ఘోరంగా మారింది. ప్రయాణికులు ఆశించినంతగా రాని సర్వీసులను రద్దు చేస్తుండటంతో.. ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పడిపోయింది.

corona effect on rtc buses
corona effect on rtc buses

By

Published : Apr 28, 2021, 8:55 AM IST

కరోనా వ్యాప్తి ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది. వైరస్‌ ఆందోళనతో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు.. వెనకడుగు వేస్తున్నారు. అవసరం అయితే తప్ప ప్రయాణాలు వద్దని ఆర్టీసీ అధికారులు కూడా సూచిస్తుండటంతో.. ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఫలితంగా పలు ప్రాంతాలకు తిరిగే అన్ని బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

పల్లె వెలుగు, ఎక్స్​ప్రెస్, డీలక్స్, ఆల్ట్రా డీలక్స్ బస్సుల్లో.. సీట్లు నిండని పరిస్ధితి. ఈ నెల మొదటి వారంలో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 62 శాతం ఉండగా.. ఇప్పుడది సగటున 58 శాతానికి పడిపోయింది. విజయవాడ సిటీ బస్సుల్లో అయితే 40 శాతం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. కొన్నిరూట్లలో బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. విజయవాడ నుంచి సచివాలయానికి రోజూ పదుల సంఖ్యలో బస్సులు నడుస్తుంటాయి. సచివాలయంలో కేసులు పెరగడంతో రాకపోకలు.. గణనీయంగా తగ్గాయి.

ఏసీ బస్సుల్లో వారం రోజులుగా ఆక్యుపెన్సీ గణనీయంగా పడిపోతోంది. 40శాతం మించి ప్రయాణాలు చేయటం లేదని అధికారులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక్క సీటు కూడా రిజర్వు కావడం లేదంటున్నారు. విజయవాడ నుంచే దాదాపు.. 30 సర్వీసులు రోజూ హైదరాబాద్‌కు వెళ్తుంటాయి. ప్రస్తుతం ప్రయాణికులు లేక..ఈ సర్వీస్సుల్లో చాలా వాటిని నిలిపివేస్తున్నారు. విశాఖ రూట్లోనూ ఎక్కువ బస్సులు రద్దవుతున్నాయి. బస్సుల్లో ప్రయాణించే కొద్ది మంది కూడా తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.

రెండో దశ కొవిడ్‌కు ముందు ఆర్టీసీ రాబడి రోజుకు 12 నుంచి 13 కోట్ల రూపాయలు ఉండగా ఇప్పుడు 8 కోట్ల రూపాయలకు పడిపోయింది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా 50 శాతం సీట్లలో మాత్రమే ప్రయాణికులను అనుమతించాలని.. ఆర్టీసీ తాజాగా నిర్ణయించింది. ఫలితంగా సంస్థకు నష్టాలు మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి:'18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్.. నేటినుంచే

ABOUT THE AUTHOR

...view details