ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా ఉగ్రరూపం... ఆరు రోజుల్లో 169 కేసులు

By

Published : Apr 5, 2020, 5:23 AM IST

రాష్ట్రంలో కరోనా విశ్వరూపం చూపిస్తుంది. తొలి కేసు నమోదైన తర్వాత... మెల్లగా వ్యాపించిన మహమ్మారి... రోజు రోజుకు పాకిపోతుంది. ఆరు రోజుల్లో సగటున రోజుకు 28 కేసులు నమోదయ్యాయి.

corona cases increasing in andhra pradesh
కరోనా ఉగ్రరూపం... ఆరు రోజుల్లో 169 కేసులు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా జడలు విప్పింది. తొలి కేసు నమోదైన తర్వాత 20 రోజులు నెమ్మదిగా వ్యాపించిన వైరస్‌.. ఆ తర్వాత ఉగ్రరూపం దాల్చింది. మొదటి 20 రోజుల్లో సగటున రోజుకు ఒక్కో కేసే నమోదవగా.. తర్వాత ఆరు రోజుల్లో సగటున రోజుకు 28 కేసులు నమోదయ్యాయి. శనివారం వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 90%కు పైగా దిల్లీ తబ్లీగీ జమాత్‌ సదస్సులో పాల్గొన్నవారు, వారికి సన్నిహితంగా మెలిగినవారే! రాష్ట్రంలో శనివారం సాయంత్రం వరకు 194 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో మార్చి 29 వరకు 21 కేసులు నమోదవగా, మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఆరు రోజుల్లో మరో 169 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో తొలి 161 కేసుల వివరాలు ఇలా..

  • కరోనా సోకిన మొదటి ముగ్గురూ విదేశాల నుంచి వచ్చిన పురుషులే.
  • నెల్లూరు యువకుడికి కరోనా సోకినట్టు మార్చి 10న నిర్ధారించారు. రాష్ట్రంలో తొలి కేసు అదే. రెండో కేసు మార్చి 18న, మూడో కేసు మార్చి 19న నమోదయ్యాయి.
  • మొదటి కేసు నమోదైన 15 రోజులకు పదో కేసు, 19రోజులకు 20వకేసు నమోదయ్యాయి.
  • తొలి 10 కేసుల్లో 8 మంది విదేశాల నుంచి వచ్చినవారు, ఒకరు దిల్లీ నుంచి వచ్చినవారు. మరొకరు మదీనా నుంచి వచ్చిన వ్యక్తి భార్య.
  • మొత్తం 161 మందిలో మహిళలు 16 మంది.
  • రాష్ట్రంలో ఇంత వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు.

30-49 ఏళ్ల మధ్యవారే ఎక్కువ

  • శుక్రవారం వరకు వచ్చిన 161 కేసుల్లో 9 మంది వయసు వివరాలు లేవు.
  • మిగతా 152 మందిలో 80 మంది 30-49 ఏళ్ల మధ్యవారే.
  • అత్యంత పిన్నవయసు పదేళ్లు కాగా, అత్యధిక వయసు 80 ఏళ్లు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా కర్నూలు జిల్లాలో కొవిడ్‌-19 డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌ ఛాంబర్‌ను శనివారం ఏర్పాటు చేశారు. నంద్యాల మండల కేంద్రంలోని శాంతిరాం వైద్యశాలను కొవిడ్‌-19 వైద్యశాలగా గుర్తించారు. వైద్యశాలకు వచ్చే సిబ్బంది, వైద్యులు, ఇతరులు ఈ గది ద్వారానే లోపలికి వెళ్లే విధంగా ఏర్పాట్లుచేశారు. దీని ద్వారా వెళ్తే అందులో నుంచి వెలువడే సోడియం హైపోక్లోరైడ్‌ స్ప్రే శరీరం, దుస్తులపై ఉండే వైరస్‌ను నాశనం చేస్తుందని శాంతిరాం వైద్యశాల వైస్‌ ఛైర్మన్‌ మాధవీలత తెలిపారు.

ఇదీ చదవండి: రైతులెవరూ నష్టపోకుండా చూడాలి: సీఎం

ABOUT THE AUTHOR

...view details