ఈ యుద్ధంలో గెలవాలంటే ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉంటే చాలదు. ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. భౌతికదూరం పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు, అవసరం లేనిదే ఇంటి నుంచి బయటకు రావొద్దు, పార్టీలు, వేడుకల వద్దని పదేపదే చెబుతున్నా పట్టించుకునే వారేరి. ఇలాంటి ఉల్లంఘనల వల్లే చాలామంది ప్రాణాలమీదకు వస్తోంది. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలోనూ కొంతమంది రోడ్లపై తిరుగుతున్నారని, అటువంటివారూ మాస్కులు ధరించకుండా తిరగడం వల్లే.. వైరస్ వ్యాప్తి జోరందుకోడానికి ముఖ్యకారణంగా కనిపిస్తోంది. ప్రజల్లో ఉన్నఇలాంటి వైఖరే పరిస్థితి చేజారడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు భారత్ తనదైన పద్ధతులు ఎంచుకోవాలని సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ సీడీడీఈపీ కుచెందిన నిపుణులు సూచిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న అవకాశాలు మనకు లేవని.. పైగా ఇక్కడ ఎక్కువమంది రోజువారీ వేతనాలతో జీవితం నెట్టుకొచ్చేవారే. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడు కోవడానికి ఇతర దేశాలకు పూర్తిగా భిన్నమైన పద్ధతులు అనుసరించాలని అంటున్నారు.