ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం సమీక్ష - సీఎం సమీక్ష

పాలనా రాజధానిని విశాఖకు తరలించే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... సాగర నగర అభివృద్ధి ప్రణాళికలపై చర్చించింది. ప్రముఖ ఆర్కిటెక్టు బిమల్ పటేల్‌తో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. విశాఖ అభివృద్ధి ప్రణాళికలపై ఆర్కిటెక్టులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు.

సమీక్షలో సీఎం జగన్
సమీక్షలో సీఎం జగన్

By

Published : Apr 10, 2021, 6:40 AM IST

మూడు రాజధానుల అంశం నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ విశాఖ మహానగర అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షించటం ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సాగర నగరాభివృద్ధి ప్రణాళికపై అధికారులు, ఆర్కిటెక్టులతో జగన్ చర్చించారు. ప్రముఖ ఆర్కిటెక్టు బిమల్ పటేల్, ఇతర నిపుణులు ఈ సమీక్షకు హాజరయ్యారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖ నగరానికి మధ్య ఉన్న ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. జగన్ సూచించారు.

ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్కిటెక్టులను కోరారు. భోగాపురం నుంచి విశాఖకు ప్రధాన రహదారి, ఇతర ప్రాంతాలకు బైపాస్‌లు, మెట్రో, ట్రామ్ వ్యవస్థలతో కూడిన సమీకృత ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా కోరారు. బీచ్‌రోడ్డును సర్వాంగ సుందరంగా, చక్కటి పర్యాటక ప్రాంతంగా నిలిచేలా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలన్నారు. విశాఖలో నిర్మించే ప్రభుత్వ భవనాలు,అతిథిగృహాలకు సంబంధించిన అంశాలు... చర్చలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

సాగర నగర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై బిమల్ పటేల్ సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. దిల్లీలోని సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఆర్కిటెక్టుగా బిమల్ పటేల్ వ్యవహరించారు. కాశీ విశ్వనాథుని దేవాలయ ప్రాంగణ అభివృద్ధి ప్రణాళికనూ ఆయనే సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖ మహానగర అభివృద్ధి ప్రణాళికను రూపొందించే బాధ్యతను సీఎం ఆయనకు అప్పగించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2,765 కేసులు

ABOUT THE AUTHOR

...view details