''రాష్ట్రంలో మళ్లీ ఎలాంటి లాక్‌డౌన్ లేకుండా కరోనాను నియంత్రించాలి. రెండోదశలో కేసులు తీవ్రమవుతున్నాయి. ఇంతకుముందు లాక్‌డౌన్‌తో ఆర్థిక రంగం దెబ్బతిన్నది. ప్రజలూ ఇబ్బంది పడ్డారు. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదు. వ్యాక్సిన్ అస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. పరీక్షలు పెంచి, ఆసుపత్రులను సన్నద్ధం చేసి కొవిడ్ విస్తరించకుండా చూడాలి. బాధితులు 104కు ఫోన్ చేసిన మూడు గంటల్లోనే... 108 వాహనం, వైద్యుడు, పడకలు, మందుల కిట్ అన్నీ సమకూర్చాలి. ఆ నంబరుకు ఫోన్ చేస్తే చాలు సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం కలిగించాలి''. అని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్బోధించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ముఖ్యమంత్రి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
ఆరు జిల్లాల్లో తీవ్రం...
''రాష్ట్రంలో గత డిసెంబరు నుంచి ఏప్రిల్ మధ్య వరకు పాజిటివ్ రేటు 7.77 శాతం. ఇప్పుడు చిత్తూరులో పాజిటివ్ రేటు ఎక్కువుగా ఉంది. తర్వాత శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. పట్టణాల్లో 62%, పల్లెల్లో 38% కేసులు నమోదవుతున్నాయి. గ్రామాల నుంచి ఆసుపత్రులకు ఆలస్యంగా వస్తుండటంతోనే మరణాలు ఎక్కువుగా ఉంటున్నాయి. వ్యాక్సినేషనే ఉత్తమ పరిష్కారమైనా అది పూర్తిగా మన చేతుల్లో లేదు. కేంద్రం డోసులు సరఫరా చేయాలి. పట్టణాల్లో రోజుకు నాలుగు లక్షలు, గ్రామాల్లో రెండు లక్షల టీకాలు ఇచ్చే సామర్థ్యం మనకుంది. అవసరమైన డోసుల కోసం కేంద్రానికి లేఖ రాస్తున్నాం. మనం ఇంకా 1.8 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు, లక్ష మంది ఆరోగ్య కార్తకర్తలకు టీకా ఇవ్వాల్సి ఉంది''.