తమిళనాడు తరహాలో మన రాష్ట్రంలోనూ పశువుల వైద్యానికీ ప్రత్యేక అంబులెన్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున మంజూరు చేసే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఆమోదం తెలిపారు. మారుమూల గ్రామాల్లో జబ్బు పడే పశువులను వీటి ద్వారా ఆసుపత్రికి తరలిస్తారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు. కడక్‌నాథ్ కోడి మాంసానికి మార్కెట్‌లో ఉన్న డిమాండు దృష్ట్యా... కడప జిల్లా ఊటుకూరులో మూతపడిన పౌల్ట్రీ ఫాంను పునరుద్ధరించాలనే ప్రతిపాదనకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. వైఎస్సార్ పశు నష్ట పరిహారం పథకం కింద... ప్రతి మూడు నెలలకోసారి చెల్లింపులు పూర్తి చేయాలని, ప్రస్తుత బకాయిలు రూ.98 కోట్లు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. పశునష్ట పరిహార పథకం వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో(ఆర్‌బీకే) ప్రదర్శించాలన్నారు.
రైతు భరోసా కేంద్రాల్లో పశువైద్య సేవలు
ప్రతి పశువైద్యుడు తప్పనిసరిగా... నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రైతు భరోసా కేంద్రాల్లో సేవలందించాలని సీఎం స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పశువైద్యులు, 6,099 పశుసంవర్థక సహాయకులతోపాటు మత్స్యశాఖ సహాయకుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ ల్యాబ్స్‌కు సంబంధించిన భవనాలన్నీ జూన్ 1 నాటికి సిద్ధం కావాలని సీఎం సూచించారు. కొత్తగా 21 ల్యాబ్ టెక్నీషియన్స్, 21 ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వ్యవసాయ,ఉద్యాన, పశుసంవర్ధక విభాగాలన్నిటికీ ఒకే కాల్‌సెంటర్, ఒకే నంబరు ఉండాలన్నారు. మూడేళ్లలో అన్ని పశువైద్యశాలలను నాడు-నేడు కింద ఆధునికీకరించాలని సూచించారు.
నాణ్యంగా లేకుంటే అధికారులదే బాధ్యత
‘ఆర్‌బీకేల్లోని కియోస్క్‌ల ద్వారా పశువుల దాణా, మందులు సరఫరా చేయాలి, విత్తనం, దాణా, వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ చేయూత కింద అందించే పశువులకు ట్యాగ్ చేయించాలి’ అని ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించారు. ‘గ్యారంటీ, టెస్టెడ్, క్వాలిటీ అనే ప్రభుత్వ ముద్ర వేసి విత్తనాలు ఇస్తున్నాం. నాణ్యంగా లేకుంటే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బయో పెస్టిసైడ్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.’ అని స్పష్టంచేశారు.