ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YSR kapunestham: కాపు నేస్తం నిధులు విడుదల.. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.490.86 కోట్లు - వైఎస్సార్​ కాపు నేస్తం తాజా వార్తలు

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం రెండో ఏడాది నిధులు విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ మీట నొక్కి 3.27లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.490.86 కోట్లు జమ చేశారు.

cm jagan releases ysr kapu nestham funds
cm jagan releases ysr kapu nestham funds

By

Published : Jul 22, 2021, 1:11 PM IST

Updated : Jul 23, 2021, 4:16 AM IST

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి (ysr Kapu Nestam scheme) సంబంధించి రెండో ఏడాది నిధులు సీఎం జగన్​ విడుదల చేశారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 వేల చొప్పున జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థిక సాయం అందింది.

'మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్​ఆర్ కాపు నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల చొప్పున లబ్ధిదారులకు ఆర్థికసాయం అందిస్తాం. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాన్ని అమలు చేస్తున్నాం. పాత బకాయిలకు కాపు నేస్తం నగదు జమ చేసుకోకూడదని ఆదేశించాం. రెండేళ్లలో కాపునేస్తం ద్వారా రూ.982 కోట్లు జమ చేశాం.'- సీఎం జగన్

ఎన్నికల ప్రణాళికలో చెప్పకపోయినా సరే కాపు నేస్తం పథకాన్ని అమలుచేశామని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. నిరుపేదలైన కాపు అక్కాచెల్లెమ్మలు స్వయంగా ఆర్థిక ప్రగతి సాధించాలనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం కింద వరుసగా రెండో ఏడాది లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ మీట నొక్కి 3,27,244 మందికి రూ.490.86 కోట్ల సాయం అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రెండేళ్లలో వివిధ పథకాల కింద మొత్తం 59,63,308 మంది కాపులకు రూ.12,126.78 కోట్ల మేర సాయం అందించామని తెలిపారు.

ఒక్క కాపు నేస్తం ద్వారానే రెండేళ్లలో 3,27,349 మందికి రూ.982 కోట్లు నేరుగా అందించామని చెప్పారు. ‘ఏటా క్రమం తప్పకుండా రూ.15 వేల చొప్పున అయిదేళ్లపాటు ఇస్తే రూ.75 వేలు వారి చేతిలో ఉంటాయి. 45-60 ఏళ్ల వయసు అక్కాచెల్లెమ్మలు త్యాగమూర్తులు, కుటుంబ బరువు బాధ్యతలు మోస్తుంటారు. వారి చేతిలో డబ్బులు పెడితే అది వారి కుటుంబానికి ఉపయోగపడుతుంది. అవినీతి, వివక్షకు తావు లేకుండా మీట నొక్కటం ద్వారా ప్రతి లబ్ధిదారురాలికి పథకం కింద మేలు చేకూరేలా చేశాం. ఈ పథకం కింద ఎవరికైనా లబ్ధి రాకపోతే భయపడొద్దు. గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే అర్హతలు పరిశీలించి నెలలో వారికి పథకాన్ని వర్తింపజేస్తారు’ అని తెలిపారు. సీఎం ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలివి.

* ‘కాపుల సంక్షేమానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. కనీసం రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదు. ఆ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వంకన్నా 15 రెట్లు అధికంగా కాపులకు సాయం చేశాం. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల కింద 47,88,663 మంది కాపులకు రూ.9,359 కోట్లు, ఇతర పథకాల కింద 11,74,645 మందికి రూ.2,766 కోట్లు వెచ్చించాం.

* వివిధ పథకాల కింద ఇచ్చిన డబ్బులను పాత అప్పులకు, బకాయిలకు జమ చేసుకోవద్దని బ్యాంకులతో ఇప్పటికే మాట్లాడాం.

* మంచి చేసే విషయంలో ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. మోసాలు చేయలేదు. త్వరితంగా అడుగులు వేస్తూనే మంచి చేస్తున్నాం. మీ బిడ్డకు మీ అందరి చల్లని దీవెనలు ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని సీఎం తెలిపారు. అంతకుముందు మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో కాపుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. స్వయంశక్తితో ఎదిగేందుకు కాపు నేస్తం ఉపయోగపడుతుందని మంత్రి వేణుగోపాలకృష్ణ వివరించారు.

చీరల డిజైనింగ్‌ దుకాణం పెట్టుకున్నా: లబ్ధిదారురాలు

‘కాపు నేస్తం’ ద్వారా వచ్చిన డబ్బులతో చీరల డిజైనింగ్‌ దుకాణం పెట్టుకున్నానని కాకినాడకు చెందిన తలాటం కాళీప్రియ చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల వ్యాపారంలో నష్టపోయానని, కాపు నేస్తం లబ్ధి చేయూతనిచ్చిందని ఏలూరులోని సత్రంపాడుకు చెందిన రుక్మిణీదేవి తెలిపారు. కాపు నేస్తం తమ జీవితాల్లో వెలుగు నింపిందని చిత్తూరు జిల్లా పెద్దశెట్టిపల్లికి చెందిన అమరావతి వివరించారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన వీరంతా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంతో మాట్లాడి అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇదీ చదవండి:

NDRF teams deployed: వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తం.. ముంపు ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

Last Updated : Jul 23, 2021, 4:16 AM IST

ABOUT THE AUTHOR

...view details