మీడియా సమావేశంలో సీఎం జగన్ కరోనా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు క్రమశిక్షణతో ఉన్నప్పుడే సమర్ధంగా ఎదుర్కోగలమని... లేకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు.
ఎక్కడివాళ్లే అక్కడే ఉండిపోండి
ప్రజలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేసిన సీఎం సరిహద్దుల వద్ద జరుగుతున్న సంఘటనలు తనను కలచివేశాయని... ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఏం చేయలేరని చెప్పారు. అందుకే ఎక్కడ ఉన్న వాళ్లు అక్కడే ఉండిపోతే అందరికీ మంచిదని సీఎం విజ్ఞప్తి చేశారు. కరోనాను కట్టడి చేయాలంటే... ఏప్రిల్ 14 వరకు ఇళ్లకే పరిమితమైతే మంచిదని సూచించారు. లేకుంటే ఎప్పటికీ సమసిపోని సమస్యగా మిగిలిపోతుందన్నారు. మనమంతా జాగ్రత్తగా ఉంటే వైరస్ వ్యాప్తి నివారించవచ్చని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారందరినీ ఎక్కడికక్కడే ఉండిపోవాలని విజ్ఞప్తి చేశారు.
'కేసీఆర్ భరోసా ఇచ్చారు'
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందనపై.. తెలంగాణలో ఉన్న ఏపీ వాళ్లకు కష్టం రానీయకుండా చూసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.
రాష్ట్రంలో 11 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో ప్రస్తుతం 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపిన సీఎం... ఇది ఏ పరిస్థితికి దారి తీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 27 వేల 819 మంది విదేశాల నుంచి వచ్చారని వీళ్లందరూ అధికారుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు.
విధుల్లో ఉన్న వారికి అభినందనలు
రాష్ట్రంలో ఇంటింటికీ సేవలు అందిస్తున్న వాలంటీర్లు, ఆశా వర్కర్లను సీఎం అభినందించారు. వీళ్లందరూ సక్రమంగా నిబద్ధతతో పని చేస్తున్నందునే కేసులు పరిమితమయ్యామని వెల్లడించారు. వైరస్‌తో మరింత దీటుగా పోరాడేందుకు 4 చోట్ల క్రిటికల్ కేర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 4, 500 ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా రోగుల కోసం ప్రతి జిల్లాలోనూ 200 పడకలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 213 ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు.
సమస్య ఏదైనా.. 1902కి కాల్ చేయండి
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... ఎవరికి వారు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎవరికి వారు సమస్య ఉన్నా 1902కు ఫోన్ చేసి ఆరోగ్య సమస్యలు మినహా ఎలాంటి ఇబ్బందులైనా చెప్పవచ్చన్నారు. ఆరోగ్య సమస్యలకు సంబంధించి 104కు ఫోన్ చేసి చెప్పవచ్చని తెలిపారు.
రీ సర్వే...
కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై రెండోసారి సర్వే చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఈసారి సర్వేలో గ్రామవాలంటీర్‌లు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి వస్తారన్నారు. జలుబు గానీ, జ్వరంగాని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని మ్యాపింగ్ చేసి వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
నిత్యావసరాల కొరత లేదు
నిత్యావసరాల వస్తువులకు కొరత రానివ్వబోమని అవసరం మేరకు నిల్వలు ఉన్నాయని సీఎం భరోసా ఇచ్చారు. హడావుడి పడి గుంపులు గుంపులుగా వచ్చి సరకులు కొనే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు సూచించారు.
రైతులు, రైతు కూలీలకు విజ్ఞప్తి
తగు జాగ్రత్తలు పాటించి పొలం పనులు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఏ ఇద్దరి మధ్యైనా దూరం ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు.