రైతులకు కనీస మద్దతు ధర లభించాలనే షరతుతోనే కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చాం. ఎవరు కొన్నా మద్దతు ధర లభించాల్సిందే. ఈ షరతుకే కట్టుబడి ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదానికి గట్టిగా కృషి చేయాలి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు వీలుగా రీనోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్రాన్ని కోరాం. దీనిపై పార్లమెంటులో గళం వినిపించాలి... అని సీఎం జగన్ వైకాపా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా ఎంపీలతో సోమవారం భేటీ అయిన సీఎం.. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మాట్లాడారు.
* పోలవరానికి రూ.1,569.86 కోట్లు బకాయిలు రావాలి. ప్రాజెక్టు వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం లభించాల్సి ఉంది. సమావేశాల్లో దీనిపై మాట్లాడాలి.
* ప్రత్యేక హోదా కోసం పలుమార్లు లేఖలు రాశాం. దిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అంశంపై గళం వినిపించాలి.
* రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి బిల్లులను ఆమోదించాం.
* 16 వైద్య కళాశాలలను నిర్మించనున్నాం. మూడింటికి అనుమతులు వచ్చాయి.
రావాల్సిన నిధులపై ప్రస్తావించండి...
* రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రూ.18,830.87 కోట్లు రావాలి. 14, 15వ ఆర్థిక సంఘాల సిఫార్సు మేరకు రూ.1,842.45 కోట్లు దక్కాలి. ధాన్యం సేకరణ రూపంలో ప్రజా పంపిణీ వ్యవస్థకు కేంద్రం రూ.4,282 కోట్లు బకాయి పడింది. నివర్ తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ, తాత్కాలిక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్ కింద రూ.2,255.7 కోట్లు అందాలి. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.700 కోట్లు, ఉపాధి హామీ కింద రూ.3,707.77 కోట్లు బకాయిలున్నాయి. వీటిపై ప్రస్తావించాలి.
పోర్టుల బిల్లుపై తగిన నిర్ణయం...
పార్లమెంటులో కేంద్రం 11 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని, వాటిపై ఏ విధానం అనుసరించాలో ఎంపీలకు సీఎం నిర్దేశించినట్లు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విలేకర్లకు తెలిపారు. ‘అంతర్రాష్ట్ర జలవివాదాల బిల్లు చర్చకు వచ్చే వీలుందని సీఎం చెప్పారు. జల వివాదాలున్న నదులన్నింటినీ జాతీయం చేసి.. వాటిని అనుసంధానించి వచ్చే నీటిని దామాషా ప్రకారం ఆయా రాష్ట్రాల భూవిస్తీర్ణం ఆధారంగా కేటాయించాలనేది మన పార్టీ విధానమని జగన్ అన్నారు. మేజర్‌పోర్ట్ అథారిటీ బిల్-2020 కూడా రానుంది. ఆ నిర్ణయాలు రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉంటే బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఓ నిర్ణయం తీసుకుందామన్నారు’ అని విజయసాయి చెప్పారు.
ఇదీ చదవండీ... కన్నకూతుర్లనే కడతేర్చిన కేసులో ముమ్మర దర్యాప్తు