AP Cabinet Reshuffle: రాష్ట్ర మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. కొత్త మంత్రుల జాబితాను ముఖ్యమంత్రి జగన్ సిద్ధం చేసుకున్నారని.. అయితే ఇప్పట్లో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టడం లేదని వైకాపా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లలో ఉండొచ్చని చెబుతున్నారు. ఏవైనా రాజకీయ పరిణామాల కారణంగా చేయాల్సి వస్తే మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలయ్యాక మంత్రివర్గంలో మార్పులకు అవకాశం ఉందని సీఎంవో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గతంలోనే నిర్ణయం..
andhrapradesh cabinet రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే సీఎం ప్రకటించారు. దాని ప్రకారం ఈ నెలలోనే పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాల్సి ఉంది. అయితే ఇద్దరు ముగ్గురు మంత్రులు కొద్ది రోజుల కిందట సీఎంను కలిసి తమ సహచరుల అభిప్రాయాలనూ ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మరోవైపు కొవిడ్ కారణంగా రెండేళ్లుగా మంత్రులు వారి శాఖల్లో పూర్తి స్థాయిలో పని చేయలేకపోయారు. వీటన్నింటి నేపథ్యంలో పునర్‌వ్యవస్థీకరణను కొంతకాలంపాటు వాయిదా వేశారన్న ప్రచారం వైకాపాలో జరుగుతోంది.