ఈనెల 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైకాపా ఎంపీలకు ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో దిశానిర్దేశం చేశారు. పోలవరం, రెవెన్యూలోటు సహా విభజన హామీల అమలు పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు సీఎం వివరించారు. ప్రత్యేక హోదా అంశంపై గళం విప్పాలని సీఎం జగన్ ఎంపీలకు స్పష్టం చేశారు. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీ వైకాపా అని.. ఆ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల సాధనకోసం వినియోగించాలని సీఎం సూచించారు. పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించాల్సిన 10 అంశాలను ముఖ్యమంత్రి చెప్పారు. వాటిలో కొన్ని..
పోలవరం
పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.11, 800 కోట్లు ఖర్చుచేస్తే అందులో రూ.8,577 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇంకా రూ. 3,222 కోట్లు రావాలి. వచ్చే జూన్ నాటికి కాఫర్ డ్యాం పూర్తవుతుంది. అప్పుడు 41.5 మీటర్ల వరకూ నీరు నిల్వ ఉండటం వల్ల సంబంధిత గ్రామాలు ముంపునకు గురవుతాయి. అందువల్ల ఆర్ అండ్ ఆర్ పనుల కోసం రూ.10వేల కోట్లు, అలాగే నిర్మాణ పనులకోసం రూ.6 వేల కోట్లు ఇచ్చేందుకు ఒత్తిడి తేవాలి. ఇవేకాక పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,549కోట్లకు కేంద్రం ఆమోదం తెలపాలి.
రెవెన్యూ లోటు