ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం ప్రాజెక్టులో అధిక నీటి నిల్వ: సీఎం జగన్ - ఏపీ సీఎం జగన్

పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించిన ఆయన... పోలవరం డ్యామ్ ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించట్లేదని స్పష్టం చేశారు. మే నెలాఖరుకు స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు సంపూర్ణంగా పూర్తి కావాలని ఆదేశించారు. 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరంలో 120 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి, కాల్వల ద్వారా సాగుకు అందిస్తామని ప్రకటించారు.

polavaram dam height
polavaram dam height

By

Published : Dec 14, 2020, 3:10 PM IST

Updated : Dec 15, 2020, 5:04 AM IST

పోలవరం పర్యటనలో సీఎం జగన్

దేశంలో ఏ డ్యాంలోనూ లేని విధంగా పోలవరం ప్రాజెక్టులో తొలిదశలో ఎక్కువ నీటిని నిల్వ చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరంలో 120 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి, కాల్వల ద్వారా సాగుకు అందిస్తామని ప్రకటించారు. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం ఏ డ్యాంలోనైనా తొలుత 33 శాతం నీటినే నిల్వ ఉంచుతారన్నారు. మనం 50 శాతం కన్నా ఎక్కువ నిల్వ చేయనున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రెండోదశలో నీటి నిల్వను 50 శాతానికి పెంచి ఆ తర్వాత పూర్తిస్థాయి సామర్థ్యానికి చేర్చాలనేది కేంద్ర జలసంఘం మార్గదర్శకమని సీఎం చెప్పారు. పోలవరంలో క్రమేణా పూర్తిస్థాయిలో 194.5 టీఎంసీల నీరు నిల్వ చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఏరియల్‌ వ్యూతో పాటు ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా సోమవారం పరిశీలించారు. ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన విషయాలతో పాటు సమావేశంలో సమీక్షకు సంబంధించి విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... పోలవరం పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ 2021 డిసెంబరుకల్లా పూర్తి కావాలని, ఇంకా చిన్నచిన్న పెండింగు పనులు, ఇబ్బందులు ఉంటే మరో మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేసుకోవాలని జగన్‌ అన్నారు. మే ఆఖరుకు స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌, కాఫర్‌ డ్యాంలోని ఖాళీలను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటేే ప్రధాన డ్యాం పనులు చురుగ్గా సాగుతాయన్నారు.

ఎత్తిపోత ఎక్కడి నుంచి...
పోలవరం ప్రాజెక్టులో డెడ్‌ స్టోరేజీ 120 టీఎంసీల నీటిలో ఎంతమేర ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో అధ్యయనం చేయాలని జగన్‌ అధికారులకు సూచించారు. స్కవరు వెంట్సు ద్వారా దిగువకు వదిలి కింది నుంచి ఎత్తిపోయాలా, పైన జలాశయం నుంచి ఎత్తిపోయాలా.. సమగ్రంగా పరిశీలించాలన్నారు. మార్చి తర్వాత కాఫర్‌ డ్యాంను మూసివేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఏప్రిల్‌ 10 దాకా గోదావరి డెల్టాకు సాగునీరు అవసరమవుతుందని, ఆ గడువు మరికొంత పెంచాలని ఎమ్మెల్యేలు ఒకరిద్దరు ప్రస్తావించారు. ఈఎన్‌సీ నారాయణరెడ్డి జోక్యం చేసుకుని అవసరమైతే స్కవర్‌ వెంట్‌ ద్వారా నీరు ఇవ్వవచ్చని చెప్పారు. అలా ఇస్తే మళ్లీ స్పిల్‌ ఛానల్‌ కాంక్రీటు పనులకు ఇబ్బందులు అవుతాయేమో చూసుకోవాలని సీఎం అన్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో గోదావరి జిల్లాలకు ఇబ్బందులు రాకుండా సమగ్ర కార్యాచరణ రూపొందించి, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుని అమలు చేయాలన్నారు.

ఎత్తు అంగుళం కూడా తగ్గదు
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారా చెప్పండి.. అంటూ సమావేశానికి హాజరైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి రంగారెడ్డిని సీఎం ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు. మా వాళ్లకు అది అర్థమయ్యేలా వివరించండి అంటూ రంగారెడ్డి చేత చెప్పించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని 45.72 మీటర్ల గరిష్ఠ నీటి నిల్వకు, 55 మీటర్ల టీబీఎల్‌ స్థాయిలో డ్యాం నిర్మిస్తామని జగన్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు పునరావాసాన్ని సరిగా పట్టించుకోక పోవడంతో చిత్రావతి, గండికోట, కండలేరు డ్యాంలు కట్టినాసరే పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేయలేక పోయామన్నారు. చిత్రావతి డ్యాం సామర్థ్యం 10 టీఎంసీలు కాగా ఏరోజూ 3 టీఎంసీలు నింపలేదన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.240 కోట్లు పరిహారం ఇచ్చి 10 టీఎంసీల నీటిని నిల్వ చేశామన్నారు. గండికోటలోనూ 20 టీఎంసీల నీటిని నిల్వ ఉంచామని చెప్పారు.

రూ.10 లక్షల ప్యాకేజీ ఇచ్చేద్దాం
పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారని, అది నెరవేర్చాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.6.50 లక్షలకు అదనంగా రూ.3.50 లక్షలు కలిపి రూ.10 లక్షలు ఇద్దామని జగన్‌ చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం 41.15 మీటర్ల స్థాయిలో నీటి నిల్వకు వీలుగా మే ఆఖరులోగా పరిహారం ఇచ్చి, పునరావాస కాలనీలు పూర్తి చేసి వారిని ఖాళీ చేయించాలని సీఎం చెప్పారు. ఇందుకోసం రూ.3,330 కోట్లు ఖర్చవుతుందని, రాబోయే మూడు నెలల్లో ఆ మొత్తం ఇచ్చేస్తామని అన్నారు. తొలుత 41.15 మీటర్లకు నీరు నిల్వ చేసి క్రమేణా 45.72 మీటర్లకు పెంచుకుంటూ వెళ్దామన్నారు.

కమిటీ ఏర్పాటు

డ్యాం నిర్మాణంలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ఒక కమిటీని కూడా నియమించామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రాజెక్టుకు నిధులు రీయింబర్స్‌ చేయడం కాకుండా జాతీయ ప్రాజెక్టు అయినందున మొదటే కొంత అడ్వాన్సుగా నిధులు తీసుకోవాలని, ఈ విషయంపై పోలవరం అథారిటీ దృష్టి సారించాలని అధికారులు కోరారు. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, అనిల్‌కుమార్‌, పేర్ని నాని, తానేటి వనిత, పినిపే విశ్వరూప్‌, వేణుగోపాలకృష్ణ, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం జగన్

Last Updated : Dec 15, 2020, 5:04 AM IST

ABOUT THE AUTHOR

...view details