ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌పై ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రమేశ్‌కుమార్ చంద్రబాబు ప్రభుత్వం నియమించిన వ్యక్తి అని ఆరోపించారు. తన సామాజిక వర్గానికే చెందిన వ్యక్తిని ఆ పదవిని కట్టబెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్.. తన ఇష్టానుసారంగా ఆదేశాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు.
'ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ఈరోజు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా బాధాకారం. విచక్షణ కోల్పోయి మాట్లాడారు. కులాలు, మతాలకు అతీతంగా పని చేయాలి. కానీ రమేశ్ కుమార్ కరోనా వైరస్ పేరుతో ఎన్నికలు వాయిదా వేశారు. అదే సమయంలో గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తూ ప్రకటన చేశారు. కరోనా సాకు చెప్పి అలా ఎలా చేస్తారు..? ప్రజలు ఓట్లు వేస్తే వైకాపా 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అధికారం వైఎస్ జగన్‌దా...రమేశ్ కుమార్‌దా? ఏమైనా అంటే విచక్షణాధికారం అంటున్నారు'