టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
గర్వకారణం: గవర్నర్ బిష్వభూషణ్
ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించడంపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతోషం వ్యక్తం చేశారు. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో సాగిన పోరులో సింధు స్పష్టమైన ఆధిక్యం కనబరిచి, వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించారని కొనియడారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆమె రెండో పతకం అందించారని గవర్నర్ అభినందనలు తెలిపారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు, తాజా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి భారత దేశానికి గుర్తింపు తీసుకు వచ్చారని గవర్నర్ ప్రస్తుతించారు.
అభినందించిన సీఎం జగన్..
ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన షట్లర్ పీవీ సింధూను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్ లో రెండో సారి కాంస్యం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు సాధించిన సింధును సీఎం అభినందించారు. భవిష్యత్తులో జరిగే ఈవెంట్లలోనూ సింధూ మరిన్నివిజయాలు సాధించాలని, దేశానికి మరిన్ని పథకాలు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు.
చంద్రబాబు, లోకేశ్ అభినందనలు..
సింధు కాంస్య పతకం సాధించినందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. మరోసారి దేశమంతా గర్వపడేలా ఒలింపిక్స్ లో విజయం సాధించిందని చంద్రబాబు కొనియాడారు. ఆమె గెలుపు అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. సింధు భారత దేశాన్ని పతకాలకు చిరునామాగా మార్చేశారని లోకేష్ కొనియాడారు. ఫోన్ ద్వారా.. సింధును చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. యావత్ క్రీడాలోకానికి స్ఫూర్తిగా నిలిచావని కొనియాడారు. సింధు పోరాట పటిమ దేశంలోని మిగతా ఆటగాళ్లకు స్ఫూర్తి అని చెప్పారు. ఈ విజయం తెలుగు ప్రజలకు మరింత గర్వకారణమన్నారు.
సింధూను చూసి దేశం గర్విస్తోంది: పవన్ కల్యాణ్
టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం గెలుచుకొని దేశానికి మరో పతకాన్ని అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభినందనలు తెలియచేశారు. టోక్యోలో దేశ పతాకం మరోమారు రెపరెపలాడేలా చేసిన సింధుని చూసి దేశమంతా గర్విస్తోందని ఆయన పేర్కొన్నారు. అప్పుడు రియోలోనూ, ఇప్పుడు టోక్యోలోనూ వరుసగా రెండు ఒలింపిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారిణిగా సింధు సాధించిన రికార్డుతో క్రీడాభిమానులు మురిసిపోతుందన్నారు. విజయం కోసం సింధు పోరాడిన తీరు, బ్యాడ్మింటన్‌లో ఆమె ఎదిగిన విధానం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని పవన్ అన్నారు.
ఇదీ చదవండి:
ఒలింపిక్స్‌లో పీవీ సింధుకు కాంస్యం