TS New Secretariat : కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సచివాలయానికి భారత సామాజిక దార్శనికుడు, మహామేధావి అంబేడ్కర్ పేరు పెట్టడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం తెలిపారు.
ఈ నిర్ణయం దేశానికే ఆదర్శం:ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమని కేసీఆర్ అన్నారు. దేశ ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలన్న అంబేడ్కర్ తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోందని తెలిపారు. అన్ని రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ.. అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. దీని వెనక అంబేడ్కర్ ఆశయాలు ఇమిడి ఉన్నాయని గుర్తుచేశారు.
అంబేడ్కర్ దార్శనికతతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తోందని కేసీఆర్ తెలిపారు. సమాఖ్య స్ఫూర్తి అమలు ద్వారానే అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు లభిస్తాయన్న అంబేడ్కర్ స్ఫూర్తి తమను నడిపిస్తోందని అన్నారు.