Polavaram calculations: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద ఎంత ప్రవాహం దిగువకు మళ్లిందనే లెక్కల నిబద్ధతపై సందేహాలు ఏర్పడ్డాయి. ధవళేశ్వరం బ్యారేజి వద్ద లెక్కలకు- పోలవరం లెక్కలకు పొంతన ఉండట్లేదు. ధవళేశ్వరం బ్యారేజి లెక్కలకు ఏళ్ల తరబడి అదే విధానం అనుసరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు భద్రాచలం గోదావరి వద్ద, శబరి.. ఆ దిగువ ప్రవాహాలు కలిపి ధవళేశ్వరానికి చేరేవి. లెక్కల్లో పెద్ద తేడాలు రాలేదు. భద్రాచలం... ధవళేశ్వరం మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణం జరగకపోయినా స్పిల్ వే 48 గేట్ల నుంచి నీటిని వదులుతున్నారు. భద్రాచలానికి, ధవళేశ్వరానికి మధ్య ప్రస్తుతం వ్యత్యాసం రావచ్చు. మధ్యలో కొంతనీరు పోలవరం జలాశయంలో నిల్వ ఉంటుంది. కానీ పోలవరం.. ధవళేశ్వరం లెక్కల మధ్య తేడా రావడంతో కేంద్ర జలసంఘం జోక్యం చేసుకుందని సమచారం.
పోలవరంలో 21.83 లక్షలు, ధవళేశ్వరంలో 25.86 లక్షలు
జులైలో గోదావరి భారీ వరదల్లో పోలవరం స్పిల్ వే వద్ద 21.83 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు లెక్కలు నమోదయ్యాయి. అదే సమయంలో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 25.86 లక్షల క్యూసెక్కులు వదిలారు. రెండు ప్రాజెక్టుల మధ్య దాదాపు 4 లక్షల క్యూసెక్కుల తేడా ఉండటాన్ని కేంద్ర జలసంఘం గుర్తించింది. ఇక్కడి లెక్కలపై దృష్టిసారించి.. పోలవరం స్పిల్ వే దిగువన స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ తర్వాత నదిలో కలిసేచోట నీటిలెక్కలు తీయాలని సూచించినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి రఘురామ్, సీఈ దీపక్‌చంద్ర పాటిల్ సూచించినట్లు తెలిసింది. వాళ్లు పోలవరం ప్రాజెక్టులో రెండు రోజులు తిరిగి అన్నీ పరిశీలించారు. ఈ సందర్భంగా అనేక సూచనలు చేశారు. పోలవరం నీటిప్రవాహ లెక్కలను సరిచేయాలనేది ఇందులో కీలకాంశం.