కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. తెరాస నేతలు కేంద్రంపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. హైదరాబాద్లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. చిరు వ్యాపారులు, మహిళా పొదుపు సంఘాలు, పేద ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేలా ప్రధాని మోదీ పని చేస్తున్నారని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్లో తెలంగాణకు ఏం వచ్చిందని కేసీఆర్ అంటున్నారన్న కిషన్రెడ్డి.. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడిందని తెలిపారు. గత ఏడాది నుంచి పేదవాళ్లందరికి 5 కిలోల బియ్యం కేంద్రం నుంచే అందిస్తున్నామని వివరించారు.