ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో కరోనా కలకలం..!

చైనాలో మొదలైన కరోనా వైరస్‌ కలకలం ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తోంది. ఇప్పటి వరకూ వ్యాధిగ్రస్థులను నిర్ధారించకపోయినా.. చైనా, హాంగ్‌కాంగ్‌ తదితర దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా.. ముందస్తుగా వైద్యులను సంప్రదిస్తున్నారు.

carona-virus-attacked-to-hyderabad
carona-virus-attacked-to-hyderabad

By

Published : Jan 27, 2020, 6:34 AM IST

హైదరాబాద్​లో కరోనా కలకలం స్పష్టిస్తోంది. బుధవారం చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక యువ వైద్యుడు జలుబు, దగ్గు లక్షణాలతో నగరంలోని ఫీవర్‌ ఆసుపత్రిలో చేరాడు. ఆ యువకుడి నుంచి నమూనాలను సేకరించి పుణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపించగా, శుక్రవారం(23న) కరోనా వైరస్‌ లేదని తేలింది. ఇదే తరహాలో ఆదివారం మరో నలుగురు ఫీవర్‌ ఆసుపత్రిలో చేరారు. వీరిలో ముగ్గురు చైనా, హాంగ్‌కాంగ్‌ దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు కాగా, మరొకరు ఆ ముగ్గురి ప్రయాణికుల్లో ఒకరి భార్య. ఈ నలుగురినీ ఆసుపత్రిలో చేర్చుకొని, వేర్వేరు గదుల్లో ఉంచి వైద్య పర్యవేక్షణలో సునిశితంగా గమనిస్తున్నారు. ఒక వ్యక్తి(40)లో మాత్రమే జలుబు, దగ్గు, జ్వర లక్షణాలు కనిపిస్తుండగా.. ఆ వ్యక్తి నుంచి నమూనాలను సేకరించి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గంలో పుణెకు పంపించారు. ఈ నమూనా ఫలితాలు ఇవాళ వస్తాయని వైద్యవర్గాలు తెలిపాయి.

మరికొందరికి పరీక్షలు

మిగిలిన ముగ్గురిలో ఇద్దరు భార్యాభర్తలు. వీరి ముగ్గురిలోనూ ముక్కు కారడం తప్ప మరే ఇతర లక్షణాలు లేవు. ప్రసార సాధనాల్లో కరోనా వైరస్‌ గురించి వస్తున్న కథనాలపై భయాందోళనలకు గురై, ముందస్తు జాగ్రత్తగా వారంతట వారే స్వచ్ఛందంగా ఆసుపత్రిలో చేరినట్లుగా వైద్యులు చెప్పారు. ఆసుపత్రిలో చేరిన నలుగురిని నిశితంగా పరిశీలిస్తున్నామనీ, ప్రస్తుతానికి జలుబుకు సంబంధించిన సాధారణ చికిత్స మాత్రమే అందజేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. పుణె నుంచి సోమవారం వెలువడే ఫలితం ప్రతికూలంగా వచ్చినా.. ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుండి విషమించినా.. వారికి అత్యవసర చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించడానికి అక్కడ ప్రత్యేకంగా 8 పడకల ఐసీయూను కూడా వైద్యఆరోగ్యశాఖ సిద్ధం చేసింది.

పరిశీలనలో కుటుంబ సభ్యులు

చైనా, హాంగ్‌కాంగ్‌ తదితర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తే..వారికి ఆసుపత్రిలో విడిగా చికిత్స అందించటంతో పాటు వారి కుటుంబ సభ్యులనూ పరిశీలనలో ఉంచాలని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. కరోనా వైరస్‌ కాదని పరీక్షల్లో నిర్ధారించే వరకూ కుటుంబసభ్యులు, సన్నిహితంగా మెలిగేవారిని ఇంటికి పరిమితం చేయాలని కిందిస్థాయి ఉద్యోగులకు ఆదేశాలు జారీచేసింది. ఎందుకంటే వ్యాధి లక్షణాలు కనిపించడానికి సుమారు రెండు వారాలు కూడా పట్టే అవకాశాలున్నాయి. ఆలోగా లక్షణాలు లేవని బయట తిరిగితే.. ఇతరులకు వ్యాప్తిచెందే ప్రమాదముందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఎగ్జిబిషన్‌ వంటి చోట్ల, రానున్న రోజుల్లో మేడారం జాతరప్పుడు పెద్దఎత్తున ఉంటారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

కరోనా వైరస్‌ ప్రబలుతున్నట్లుగా సమాచారమొస్తున్న దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలనీ.. ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఆ తరహా అనుమానిత లక్షణాలున్న వ్యక్తుల సమాచారాన్ని సత్వరమే ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు అందజేయాలని తెలంగాణ వైద్యశాఖ ఆదేశాలు జారీచేసింది.

కరోనా వ్యాధి లక్షణాలు

  • ముక్కుకారడం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నలతగా అనిపించడం.
  • వ్యాధి తీవ్రమైనప్పుడు ఛాతీలో నొప్పి, చలి, జ్వరం, గుండె వేగం పెరగడం, నిమోనియా, మూత్రపిండాల వైఫల్యం.

ఇదీ చదవండి:నేడు మంత్రివర్గ సమావేశం... మండలి రద్దుపై తీర్మానం!

ABOUT THE AUTHOR

...view details