చరిత్రలో ఎక్కడైనా అభివృద్ధిని వికేంద్రీకరించారు తప్ప.. పరిపాలనను కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో రాజధానిని మార్చిన ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహనరెడ్డి మాత్రమేనని ఎద్దేవా చేశారు. రాజధాని అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండే ప్రాంతంలో పెట్టాలన్నారు. అమరావతి అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉందన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కలిసి ఉన్నప్పుడు దేశ రాజధానిగా ఢిల్లీని ఏర్పాటు చేశారని వ్యాఖ్యనించారు. ఒడిశా, కేరళలోని కొన్ని ప్రాంతాలతో పాటు... ఆంధ్రరాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మద్రాసు రాజధానిగా ఉందని.. అప్పట్లో అది కూడా అన్ని ప్రాంతాలకు దగ్గరలోనే ఉందన్నారు. రాజధాని ఏర్పాటుతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందవన్నారు. ఆర్థికాభివృద్ధి జరిగినప్పుడే ప్రాంతాలు అభివృద్ధి అవుతాయన్నారు.
శుక్రవారం కోర్టుకు వెళ్లే వాళ్లు మా గురించి మాట్లాడుతున్నారు
రాజధాని అంశంపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి వచ్చామన్నారు. దీనిపై ఓటుకు నోటు అంటూ.. అధికార పక్ష సభ్యులు అరవడంతో.. శుక్రవారం కోర్టుకు వెళ్లేవారంతా తమను విమర్శిస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.