బ్లాక్ ఫంగస్ బారినపడిన వారికి చికిత్స చేసేందుకు అవసరమైన ఇంజక్షన్ల కొనుగోలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడ్డ వారికి తక్షణం అవసరమైన 'యాంపోటెరిసిన్-బి' ఇంజక్షన్లు మార్కెట్‌లో లభించకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్రంగా కలత చెందుతున్నాయి. కొందరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వీటి కోసం ప్రయత్నిస్తున్నారు. ఎంత ధరైనా చెల్లించి కొనేందుకు సిద్ధపడుతున్నా అవి లభించడం లేదు.
అయితే 'యాంపోటెరిసిన్-బి' 50ఎంజీ, 100 ఎంజీ ఇంజక్షన్లను.. 10 వేలు చొప్పున కొనుగోలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్రం సూచించిన రెండు సంస్థలతో ఇప్పటికే ఒకసారి వైద్య ఆరోగ్య శాఖ చర్చలు జరిపింది. అదనంగా మరో కంపెనీతో కూడా మాట్లాడుతోంది. బ్లాక్ ఫంగస్ బారినపడిన రోగికి కనీసం 60 నుంచి 90 వరకు ఈ ఇంజక్షన్లను వాడాల్సి రావచ్చని చెబుతున్నారు. ఒక్కో ఇంజక్షన్ ధర రూ. 5,900 నుంచి రూ. 6,200 మధ్య ఉండవచ్చని తెలిసింది. ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ స్వల్పకాలిక టెండర్లను ఆహ్వానించింది. మరో వారంలో కొన్ని మందులు రాష్ట్రానికి రావచ్చని వారు భావిస్తున్నారు.
ప్రభుత్వం ద్వారానే ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా..
ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి కూడా వైద్య ఆరోగ్య శాఖ ద్వారానే ఇంజక్షన్ల సరఫరా జరిగేలా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. కొవిడ్ బాధితుల్లో ఆరోగ్యం విషమించిన వారికి టోసిలిజుమాబ్ ఇంజక్షన్ ప్రస్తుతం ఏ విధంగా ప్రభుత్వం ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు సరఫరా జరుగుతుందో..అదే విధానాన్ని యాంపోటెరిస్-బి ఇంజక్షన్ల విషయంలోనూ అనుసరించాలని భావిస్తున్నారు. బాధితుల్లో అవసరమైన వారికి టోసిలిజుమాబ్ ఇంజక్షన్ ఇవ్వాలంటే సంబంధిత ఆసుపత్రి వైద్య నిపుణులు సిఫార్సు చేయాలి. దీనిని సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఆమోదిస్తేనే ఈ ఇంజక్షన్ రోగికి చేరుతుంది. అన్ని ఖర్చులు కలుపుకొని నిర్ధారించే ధరకు అనుగుణంగా ప్రైవేట్ ఆసుపత్రులు చెల్లించాలి.
పెరుగుతోన్న కేసులు..