వైకాపా ప్రభుత్వ పాలనపై భాజపా నేత సత్య కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపా అసమర్థత ప్రజలకు శాపంగా మారిందన్నారు. జగన్ వచ్చాక రాజధానిపై స్పష్టత లేదన్న ఆయన.. పెట్టుబడుల జాడ లేదని దుయ్యబట్టారు. 'భాజపా జాతీయ కార్యవర్గ భేటీలో మిత్రుడు ఏపీ గురించి అడిగారు. ఏపీలో పెట్రో పన్ను ఎందుకు తగ్గించలేదని అడిగారు. ఏపీ సీఎం జగన్ గురించి ఆయనకు 4 ముక్కల్లో చెప్పా. సీఎం గారి తప్పులు.. రాష్ట్ర ఖజానా అంతా అప్పులు. మంత్రులవి అబద్ధపు గొప్పలు.. జనాలకేమో తిప్పలు' అంటూ బదులిచ్చానంటూ సత్య కుమార్ ట్వీట్ చేశారు
'వైకాపా నేతలు రాష్ట్రం దాటి వచ్చి దేశంలో రోడ్లు చూడాలి. దేశంలో ఎక్కడా వర్షం పడలేదా..? రోడ్ల మరమ్మతు జరగలేదా..? వైకాపా అసమర్థత ప్రజలకు శాపంగా మారింది. జగన్ వచ్చాక రాజధానిపై స్పష్టత లేదు.. పెట్టుబడుల జాడ లేదు. మీకు పాలన చేతకాక కేంద్రం మీద పడి ఏడుస్తున్నారా..? రాజధాని కోసం భూములిచ్చిన రైతులను తరిమేశారు. రాజధానికి గత ప్రభుత్వం వేసిన 4 శాతం వ్యాట్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆ నిధులు వాడేది.. అమరావతి నిర్మాణానికా.. కూల్చేందుకా?' - భాజపా నేత సత్యకుమార్
రాజధాని అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని భాజపా జాతీయ కార్యదర్శి గుర్తు చేశారు. కేంద్రం సాయంతో అద్భుత రాజధాని నిర్మాణం జరిగేదని అభిప్రాయపడ్డారు. ఏపీలో సంపద పెరిగి చెప్పుకునేందుకు రాజధాని ఉండేదన్నారు. చెప్పుకునేందుకు ఏమీలేకే బురదజల్లే ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.