Honor killing case: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసును.. పోలీసులు గంటల వ్యవధిలో చేధించారు. నీరజ్ పన్వర్ భార్య సంజన తరపు బంధువులే హత్యకు పథక రచన చేసినట్టు తేల్చారు. సంజనను వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆమె పెదనాన్న కుమారుడు అభినందన్ యాదవ్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
అసలు కథ ఇదీ :బేగంబజార్ కోసల్‌వాడీలో నివాసముంటున్న నీరజ్ గతేడాది ఏప్రిల్‌లో అక్కడే ఉంటున్న సంజనను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆమె తల్లిదండ్రులకు వివాహం ఇష్టం లేకపోవడంతో.. దంపతులు అఫ్జల్‌గంజ్ పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాలను పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలిపించారు. పాతబస్తీలోని షంషీర్‌గంజ్‌లో ఉండాలంటూ నీరజ్, సంజన దంపతులకు పోలీసులు సూచించారు. అప్పటి నుంచి వారు పాతబస్తీలోనే ఉంటున్నారు. వారి కులాంతర వివాహం ఇష్టం లేని సంజన పెదనాన్న కుమారుడు అభినందన్ అప్పట్లోనే దంపతులిద్దరినీ బెదిరించాడు. మా ఇంటి వైపు వస్తే చంపుతానంటూ హెచ్చరించాడు. ఏడాది వరకు నీరజ్ అక్కడకు వెళ్లలేదు. కొద్ది రోజుల నుంచి సంజన, నీరజ్ కోసల్‌వాడీలోని తమ దుకాణానికి రాకపోకలు సాగిస్తున్నారు. ఇది నచ్చని సంజన మేనమామ కుమారుడు విజయ్‌యాదవ్, అభినందన్ నీరజ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు.
రెక్కీ నిర్వహించి: నీరజ్‌ను హత్య చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్న విజయ్, అభినందన్, సంజయ్ తమ స్నేహితులు రోహిత్, మహేష్, మరో మైనర్ బాలుడితో కలిసి జుమ్మేరాత్‌బజార్‌లో మూడు రోజుల కిందల రెండు కత్తులు కొన్నారు. నీరజ్‌ను అంతం చేయడానికి ఎక్కడ అనుకూలంగా ఉంటుందనే విషయంలో రెక్కీ నిర్వహించారు. శుక్రవారం చంపాలనుకున్న వారు సాయంత్రం వరకు మద్యం సేవించి కత్తులు సిద్ధం చేసుకున్నారు. సాయంత్రం ఏడు గంటలకు పల్లీల దుకాణానికి వచ్చిన నీరజ్ బంధువుల ఇంట్లో వేడుక ఉందని తాతను వెంటబెట్టుకుని బేగంబజార్ నుంచి మచ్చీగల్లీ మీదగా వెళ్తుండగా వారి వెనకనే రెండు ద్విచక్ర వాహనాల్లో విజయ్, అభినందన్, రోహిత్, మహేష్ అనుసరించారు. యాదగిరి గల్లీ వద్దకు చేరుకోగానే అభినందన్ ముందుకు వెళ్లి నీరజ్‌ను అడ్డుకున్నాడు. ఆ వెంటనే మిగతావారు కూడా వచ్చి నీరజ్‌ను రాయితో కొట్టారు. ఆ తర్వాత కత్తులతో నీరజ్‌ను పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన నీరజ్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో.. పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరికోసం గాలిస్తున్నట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయెల్ డేవిస్ తెలిపారు.
"షాయినాత్‌గంజ్‌కు చెందిన సంజనను ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్.. కొంతకాలం పాతబస్తీ ఫలక్‌నుమా ప్రాంతంలో నివసించాడు. ఇటీవలే తిరిగి షాయినాత్‌గంజ్‌కు రాకపోకలు సాగించడం మొదలుపెట్టాడు. 10 రోజులుగా అతని కదలికలు గమనించిన సంజన సమీప బంధువులు.. ఎలాగైనా అతడిని అంతమొందించాలని భావించారు. ఇందుకోసం 2 రోజుల క్రితం కత్తులు కొనుగోలు చేశారు. తన తాతతో కలిసి వెళ్తున్న నీరజ్‌ను పథకం ప్రకారం అటకాయించి.. మొదట రాయితో దాడి చేశారు. అనంతరం ఆరుగురు కలిసి కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. విజయ్, సంజయ్, రోహిత్‌తో పాటు మైనర్ బాలుడిని అరెస్టు చేయగా.. అభినందన్, మహేశ్ పరారీలో ఉన్నారు.'' - జోయల్ డేవిస్, పశ్చిమ మండల డీసీపీ