ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కేసీఆర్​ ఫాంహౌస్​, ప్రగతి భవన్​ పేదలకు పంచుతాం..' - తెలంగాణ వార్తలు

2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌లను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భాజపా ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో బండి సంజయ్‌ మాట్లాడారు.

bandi-sanjay
బండి సంజయ్‌

By

Published : Jul 30, 2021, 5:19 PM IST

Updated : Jul 30, 2021, 6:29 PM IST

'ఆ భవన స్థలాలను లక్షనాగళ్లతో దున్నుతాం'

తెలంగాణలో భాజపా(bjp) అధికారంలోకి రాగానే ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్ని... బడుగువర్గాల వారికి పంచుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) అన్నారు. రాష్ట్రంలో 18శాతం ఉన్న దళితుల్లో ఏ ఒక్కరికీ ముఖ్యమంత్రిగా పని చేసే అర్హత లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన బడుగుల ఆత్మ గౌరవ పోరులో ఆయన పాల్గొన్నారు. ప్రగతి భవన్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ఆయన.. అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఆ దస్త్రంపైనే పెడతామని స్పష్టం చేశారు.

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న సీఎం కేసీఆర్.. పంట చేతికొచ్చాక పోడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మూడెకరాల భూమి ఇస్తానన్న సీఎం.. ఎస్సీలకు రూ.10 లక్షలు ఇస్తానని మళ్లీ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి దళితుడికి రూ.30లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఓట్లు కొనుగోలు చేసే ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్, ఆత్మగౌరవ భవనాలు ఎక్కడికి పోయాయని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో కులవృత్తులను సీఎం సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు.

2023 ఎన్నికల్లో భాజపాదే విజయం. మేం అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్నుతాం. ఆ భూమిని దళితులకు పంచుతాం. శాంతి భద్రతల పేరుతో భాజపా కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అనుమతులతోనే మేం ధర్నా చేపడుతున్నాం. అనుమతుల్లేకుండా మేం నిరసనలు చేస్తే మమ్మల్ని అడ్డుకునే శక్తి సీఎం కేసీఆర్‌కు లేదు. ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీని ముట్టడించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని బహిర్గతం చేయడానికే ఈ ఆత్మ గౌరవ పోరును ప్రారంభించాం. పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి.

-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

హుజూరాబాద్‌లో దళితులకు రూ.10 లక్షలు ఇస్తానంటున్నారు కానీ.. వాటితో ఒక్క ఎకరం భూమి రాదని ఆయన అన్నారు. ఒక్కొక్కరికి రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. ఈ ధర్నాలో భాజపా నేతలు లక్ష్మణ్, డి.కె.అరుణ, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Bandi Sanjay: 'హూజూరాబాద్​లో అన్ని సర్వేలు భాజపాకే అనుకూలం'

Last Updated : Jul 30, 2021, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details