తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల(FD) కుంభకోణంపై సమగ్ర విచారణ బాధ్యతను ప్రభుత్వం రాష్ట్ర ఆడిట్ శాఖకు అప్పగించింది. రాష్ట్రంలో సంచలనం కలిగించిన రూ.64.5 కోట్ల ఎఫ్‌డీల కుంభకోణంలో ఇప్పటికే పది మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కుంభకోణానికి దారితీసిన పరిస్థితులు, తెలుగు అకాడమీలో సంస్థాగతంగా ఉన్న లోపాలతో పాటు వివిధ అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వం ఆడిట్‌శాఖను ఆదేశించింది. డిపాజిట్లను స్వాహా చేసేందుకు అనుకూలించిన పరిస్థితులతో పాటు తనిఖీ విభాగాల వైఫల్యాలు, ఆర్థిక అంశాలను ఆడిట్ శాఖ సమగ్రంగా పరిశీలించనుంది. సంస్థలో గత కొన్నేళ్లుగా జరిగిన ఆర్థిక వ్యవహారాలపై ఆడిట్ చేయనున్నారని తెలిసింది.
పోలీసుల విచారణ
బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన తెలుగు అకాడమీ డిపాజిట్లను దొంగదారిన విత్ డ్రా చేసుకున్న నిందితులు ఆ డబ్బును పప్పు, బెల్లాల్లా పంచుకున్నారు. యూబీఐ కార్వాన్, సంతోష్ నగర్ ఖాతాల్లో రూ.54.5 కోట్లు.. చందానగర్‌లోని కెనరా బ్యాంకులో ఉన్న రూ.10 కోట్లను కొల్లగొట్టిన ముఠా సభ్యులు మొత్తం రూ.64.5 కోట్లు వాటాలుగా పంచుకున్నారు. ఇందులో అధిక వాటా తీసుకున్న వెంకటసాయి కుమార్ హైదరాబాద్ బాహ్యవలయ రహదారికి పక్కన 35 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. దుబాయి నుంచి తక్కువ ధరకు డీజిల్ వచ్చేలా ఏజెన్సీ ఇప్పిస్తానంటే ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇచ్చి మోసపోయినట్లు సీసీఎస్ పోలీసులకు తెలిపారు. యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీకి వచ్చిన రూ.2.5 కోట్ల డబ్బులతో ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధన కూడా 2 కోట్ల రూపాయలు తీసుకొని ఫ్లాట్లు కొనుగోలు చేసింది. కొంత నగదు ఉందని దాన్ని వెనక్కి తిరిగిచ్చేస్తామని పోలీసులకు తెలిపారు. మరో నిందితుడు వెంకటేశ్వర్ రావు రూ.3 కోట్లు తీసుకొని సత్తుపల్లిలో బహుళ అంతస్థుల భవనం నిర్మిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ శాఖల్లోని డబ్బులను డిపాజిట్ల పేరుతో కొల్లగొట్టేందుకు కృష్ణారెడ్డి, సాయికుమార్ కలిసి ముఠా ఏర్పాటు చేసి కథ నడిపించినట్లు పోలీసులు తేల్చారు.