ఈ నెల 14న పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా ఎక్కడికక్కడ ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం కౌంటింగ్ కేంద్రాలను నిర్ణయించారు. కార్పొరేషన్లలో స్థానికంగా కేంద్రం ఏర్పాటు చేసి డివిజన్ల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. 12 కార్పొరేషన్లలో స్థానికంగా 17 కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. తాము చెప్పేవరకు ఏలూరు కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపల్ ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేంద్రాల్లోనూ ఓట్ల లెక్కింపు కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది.
విజయనగరం కార్పొరేషన్‌కు సంబంధించి పాత బస్టాండ్ సమీపంలో రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఓట్లను లెక్కించనున్నారు. విశాఖపట్నం కార్పొరేషన్‌కు సంబంధించి వాల్తేరులోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు చేపడతారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌కు సంబంధించి వట్లూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ కార్పొరేషన్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపును ఆంధ్ర లయోలా కళాశాలలో నిర్వహిస్తారు. మచిలీపట్నం కార్పొరేషన్ ఓట్ల లెక్కింపును కృష్ణా యూనివర్సిటీలో చేపడతారు.
గుంటూరు కార్పొరేషన్లో స్థానికంగా 4 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ టెక్స్ టైల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ న్యూబ్లాక్, నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్, ప్రభుత్వ టెక్స్టైల్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఓల్డ్ బ్లాక్‌లో ఓట్లను లెక్కించనున్నారు. ఒంగోలు కార్పొరేషన్లో సెయింట్ క్సావియర్ హైస్కూల్, కళాశాలలో, అనంతపురం కార్పొరేషన్‌కు సంబంధించి స్థానిక ఎస్ఎస్బీఎమ్ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు.