నూతన ఇసుక విధానం.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపుతోంది. తీవ్రమైన వివాదం తర్వాత మెరుగైన ఇసుక సరఫరా కారణంగా వినియోగం పెరుగుతోంది. నవంబరు నెలలోనే 23 లక్షల 81 వేల 716 మెట్రిక్ టన్నుల ఇసుకను ఏపీఎండీసీ రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేసింది. ప్రస్తుతం గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా నదుల రీజియన్లలోని 271 ఇసుక రీచ్‌లతో పాటు ప్రైవేటు పట్టా భూముల్లోనూ..పెద్ద ఎత్తున తవ్వకాలు చేపడుతున్నారు.
ఇసుకతో నవంబరు 30 తేదీ నాటికి 89.31 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. అపార్ట్మెంట్లు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం కోసం 3 లక్షల 88 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా అయితే అందులో 'మన సాండ్' యాప్‌తో పాటు వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్న సాధారణ వినియోగదారులకు 19 లక్షల 92 వేల మెట్రిక్ టన్నులను సరఫరా చేసినట్టు ఏపీఎండీసీ వెల్లడించింది.
జిల్లాల వారీగా వివరాలు
- పశ్చిమగోదావరిజిల్లాలో 4 లక్షల 81 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరాకు గానూ 18 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చింది.
- శ్రీకాకుళం జిల్లాలో లక్షా 53 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేశారు.
- విజయనగరం జిల్లాలో కేవలం 14 వేల 766 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే సరఫరా అయ్యింది. ఇందుకుగానూ ఇసుక సీనరేజి ద్వారా 55 లక్షల ఆదాయం వచ్చింది.
- విశాఖపట్నం జిల్లాలో 1 లక్షా 18 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా అయితే 4.44 కోట్ల ఆదాయం ఖజానాకు సమకూరిందని ప్రభుత్వం తెలిపింది.
- తూర్పు గోదావరి జిల్లాలోనూ లక్ష మెట్రిక్ టన్నులకు పైగా ఇసుక సరఫరా అయితే 4 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరింది.
- కృష్ణాజిల్లా పరిధిలో సాధారణ వినియోగదారులకు 2 లక్షల 15 వేల 539 మెట్రిక్ టన్నులు- బల్క్ వినియోగదారులకు 40 వేల 591 టన్నుల ఇసుక సరఫరా అయ్యింది. మొత్తం 9.60 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.
- గుంటూరు జిల్లాలో 4.42 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయానికి గానూ 16 కోట్ల ఆదాయం వచ్చింది.