Inam Lands in AP : వివాదాస్పదంగా మిగిలిన ఇనాం భూముల సమస్యల పరిష్కార క్రమంలో యాజమాన్య హక్కులు కల్పించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూర్చే ప్రయత్నాల్లో భాగంగా దీనిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. స్వాతంత్య్రానికి పూర్వం రాజులు, జమీందారులు దేవాలయాలకు సేవలందించే వారికి జీవనోపాధి నిమిత్తం సాగు భూములను ఇనాంగా (బహుమానం) ఇచ్చారు.
రాచరిక, జమిందారీ వ్యవస్థలు రద్దు చేసిన నేపథ్యంలో 1956లో అప్పటి ప్రభుత్వం ఇనాం చట్టాన్ని తెచ్చింది. అధికారులు అప్పుడు రైత్వారీ పట్టాలు మంజూరు చేశారు. కానీ ఈ భూములు పలువురి చేతులు మారాయి. తదనంతర పరిణామాల్లో ఇవి కొన్నిచోట్ల నిషిద్ధ జాబితాలోకి చేరాయి. ప్రభుత్వ భూమా? ఇనాం భూమా? అన్న వివాదాలు చాలాచోట్ల ముసురుకొన్నాయి. కోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. అనుభవదారులైన కొందరి వద్ద తగిన ఆధారాలు లేవు. అపరిష్కృతంగా ఉన్న ఇనాం భూముల సమస్యలు కొలిక్కితెచ్చే దిశగా చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ఖజానాకు నిధులు చేరతాయని, అనుభవదారులకు హక్కు లభిస్తుందని భావిస్తున్నారు.