Protest: కరోనా సమయంలో ప్రభుత్వాసుపత్రుల్లో విశేష సేవలందించిన.. పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాట పట్టారు. నాలుగు నెలలుగా జీతాల్లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను ఎలా చేసుకోవాలని.. అప్పులు కూడా పుట్టని పరిస్థితుల్లో ఎలా జీవనం సాగించాలో అర్థంకావడం లేదని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల్లో ఎక్కువమంది మహిళలే. కొన్నిచోట్ల భార్యాభర్తలిద్దరూ పని చేస్తున్నారు. వీరందరూ ప్రస్తుతం వేతనాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ‘పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో ముఖ్యమని.. వారి వేతనాలు పెంచాలని ఆదేశాలు జారీచేసిన సీఎం జగన్.. ప్రస్తుత పరిస్థితుల్లో మా గురించి పట్టించుకోవాలి’ అని అభ్యర్థిస్తున్నారు. కొన్నిచోట్ల సెక్యూరిటీ సిబ్బందికీ, కొవిడ్ అవసరాల కోసం తాత్కాలికంగా విధుల్లో చేరిన సిబ్బందికీ వేతనాల చెల్లింపులు సక్రమంగా సాగడం లేదు. పెండింగులో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని విజయవాడ కొత్త, పాత ఆసుపత్రుల్లో పనిచేసే సుమారు 250 మంది పారిశుద్ధ్య సిబ్బంది మంగళవారం ఆందోళనకు దిగారు.
ప్రభుత్వం నియమించిన ఏజెన్సీల ద్వారా వీరు ఆసుపత్రుల్లో పని చేస్తున్నారు. మరోపక్క పారిశుద్ధ్య కార్మికుల వేతనాలకు సంబంధించి జిల్లా అధికారులకు బిల్లులు సమర్పించినా నెలల తరబడి చెల్లింపులు జరగలేదని ప్రైవేట్ ఏజెన్సీల వారు చెబుతున్నారు. విజయవాడలోని ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు సుమారు రూ.5 కోట్ల దాకా పెండింగులో ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ‘ఆసుపత్రుల్లో పని చేసేందుకు కొంతమంది దూరప్రాంతాల నుంచి వస్తున్నారు. ఓ పక్క రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి. మరో పక్క వారికి వేతనాలు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల చేత పని చేయించలేక.. వారికి నచ్చచెప్పలేక.. ఇబ్బందులు పడుతున్నాం’ అని ఓ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులే వేతనాల చెల్లింపులపై చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో స్థాయిని బట్టి 3 షిఫ్టుల్లో పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వారికి స్థానిక పరిస్థితులను బట్టి వేతనాల్ని ఇస్తున్నారు. బోధనాసుపత్రుల్లో విధులు నిర్వర్తించే వారికి నెలకు రూ.16 వేలు చెల్లిస్తామని గత ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ఎన్నిచోట్ల చెల్లింపులు జరుగుతున్నాయో స్పష్టత కొరవడింది.
- అనంతపురం జీజీహెచ్‌లో వంద మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. ఐదారు నెలల నుంచి వేతనాల్లేవు. ఇటీవల ఆందోళన చేయగా అధికారులు సర్దిచెప్పారు. గుంటూరు బోధనాసుపత్రిలో పనిచేసే సుమారు 200 మంది, తిరుపతి రుయాలో పారిశుద్ధ్య సిబ్బందికీ 4 నెలల నుంచి వేతనాలు అందడం లేదు. కడప జిల్లాలోని పలు ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. నెల్లూరు జీజీహెచ్‌లో 3 నెలల నుంచి, ప్రకాశం జిల్లా దర్శి సామాజిక వైద్యశాలలో పని చేసే సిబ్బందికి 4 నెలల నుంచి వేతనాల చెల్లింపులు నిలిచాయి. చీరాల ఏరియా ఆసుపత్రిలో ఒక నెల వస్తే మరోనెల రావడం లేదు.
- విశాఖ ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి కొంత ఆలస్యంగానైనా వేతనాలు అందుతున్నాయి. ఇక్కడి గుత్తేదారుకు మాత్రం సుమారు రూ.2 కోట్ల చెల్లింపులు నిలిచాయి. ‘మేం అప్పులుచేసి మరీ వేతనాలు ఇస్తున్నాం. ప్రభుత్వపరంగా చెల్లింపుల్లేవు. ఎన్ని నెలలు ఇలా చేయాలో అర్థంకావడం లేదు’ అని గుత్తేదారులు వాపోయారు.