Political Parties unity Support for Amaravati: రాజకీయ పార్టీలంటేనే ఒకరికి ఒకరు అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ ఉంటారు. రాజధాని రైతుల మహాపాదయాత్ర ముగింపు సభ ఇందుకు భిన్నంగా సాగింది. ఒక్క వైకాపా మినహా అన్ని రాజకీయ పక్షాలు ఒకేతాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభలో స్పష్టం చేశాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఒకే అభిప్రాయం వ్యక్తపరిచాయి. భిన్న ధృవాలైన తెలుగుదేశం, భాజపా, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన... ఇలా అన్ని పక్షాలు అమరావతికి సై అన్నాయి. రైతులు, మహిళలు చేస్తున్న ధర్మపోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించాయి. ప్రభుత్వం దిగివచ్చే వరకూ ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశాయి.
రాజధాని లేని రాష్ట్రం కోసం భూములను త్యాగం చేసిన రైతులను రోడ్లపైకి నెట్టి వేడుక చూడటం జగన్‌కే చెల్లిందని.... తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ముంపు ప్రాంతమని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలడంతో... ఓ కులానికి ఆపాదించి అమరావతిని నిర్వీర్యం చేసేందుకు యత్నించారని ఆక్షేపించారు.
Political Parties On Amaravati Capital City: జగన్ అమరావతిని విధ్వంసం చేయకుండా ఉంటే.. దానంతట అదే అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు. రైతుల పోరాటానికి పూర్తి సంఘీభావం తెలిపిన వామపక్షాల నేతలు... ప్రధానితో పాటు అమిత్‌షాతో ఒక్క ఫోన్ కాల్ చేయిస్తే... జగన్ ఎందుకు వినరని ప్రశ్నించాయి. భాజపా నేతలు ఆ పనిచేయాలని సూచించాయి. దోచుకోవడానికే 3 రాజధానులను తెరపైకి తెచ్చారని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి... అన్నదాతలకు మద్దతు తెలిపారు. వికేంద్రీకరణ పేరుతో కాలయాపన చేయకుండా... ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీల సాధనకు పోరాడాలని సూచించారు. అమరావతి రాజధానిగా కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం భవిష్యత్తులో రైతులు చేసే పోరాటానికి అండగా నిలుస్తామని అన్ని పార్టీల నేతలు భరోసా కల్పించారు.