ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర పద్దులో రాష్ట్రానికి మరోసారి అన్యాయం: విపక్షాలు - ap oppositions response on the central budget

కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రంలోని విపక్షాలు పెదవి విరిచాయి. కేవలం ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలే లక్ష్యంగా పద్దును రూపొందించారని విమర్శించాయి. ఏపీ పై సవతి తల్లి ప్రేమ కొనసాగించారని మండిపడ్డాయి. నిధుల సాధనలో సీఎం జగన్‌ విఫలమయ్యారని తెలుగదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు.

కేంద్ర బడ్జెట్ 2021
కేంద్ర పద్దు 2021

By

Published : Feb 2, 2021, 4:15 AM IST

కేంద్ర వార్షిక పద్దుపై....రాష్ట్రంలోని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేవలం కార్పొరేట్లు, త్వరలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలే ప్రధానంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని విమర్శించాయి. సామాన్యులకు ఊరట కలిగించే అంశం ఒక్కటీ లేదని ఆక్షేపించాయి. రాష్ట్రానికి ఈసారి పద్దులోనూ అన్యాయమే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

సీఎం జగన్ విఫలం: చంద్రబాబు

రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో జగన్‌ విఫలమయ్యారంటూ తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, 7 వెనుకబడిన జిల్లాలకు నిధులు, అమరావతి, పోలవరానికి నిధులు ఏమీ లేవని మండిపడ్డారు. విభజన హామీలూ నెరవేర్చలేదన్నారు. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్నే జగన్‌ తాకట్టు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. 25మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. దిల్లీలో వైకాపా ఎంపీలు అసలేం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని.. తెదేపా ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు నిలదీశారు. కాంగ్రెస్‌, సీపీఐ నేతలూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాకారం దిశగా...

కేంద్ర బడ్జెట్‌ స్వయం సమృద్ధి ఆత్మనిర్భర్ భారత్‌ సంకల్పం సాకారం దిశగా ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అభిప్రాయపడింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో సాధారణ అంశాలతో పాటు అసాధారణ అంశం కరోనా అనిశ్చితిని బడ్జెట్‌ పరిగణనలోకి తీసుకుందని పేర్కొంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ కల సాకారం దిశగా కేంద్ర బడ్జెట్‌ ఉందన్న ఆ పార్టీ నేతలు...ప్రతిపక్షాలవి అర్ధరహిత విమర్శలని ఆక్షేపించారు.

కేంద్ర పద్దులో ఈ సారి విద్యా రంగానికి ప్రాధాన్యం ఇచ్చారని నిపుణులంటున్నారు. ప్రధానంగా పరిశోధనకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృధికి నిధులు కేటాయించి మరింత ఊతం ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆరోగ్య రంగానికి కేటాయింపులు, ప్రైవేటు రంగానికి ఊతమిచ్చే విధంగా లేవని....వైద్య నిపుణులు అంటున్నారు.

ఇదీ చదవండి

పంచాయతీ పోరు: రెండో దశకు నేటి నుంచి నామినేషన్లు

ABOUT THE AUTHOR

...view details