ఆంధ్రప్రదేశ్ లో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ్టి నుంచి 2023 వరకూ నూతన విధానం అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చే పరిశ్రమలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వేగంగా అనుమతుల మంజూరుకు వైఎస్ఆర్ ఏపీ వన్ పేరిట సింగిల్ విండో కేంద్రాన్ని పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసింది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్ పర్సన్ ఆర్కే రోజా నూతన పారిశ్రామిక విధానాన్ని విడుదల చేశారు.
మూడేళ్ల స్వల్పకాలిక విధానం
నాణ్యత కలిగిన ఉపాధి కల్పనతో పాటు జాతీయ స్థాయిలో తలసరి జీవీఏను అందుకునేలా పారిశ్రామిక పురోగతి, అన్ని ప్రాంతాల్లోనూ పారిశ్రామిక అభివృద్ధి, పర్యావరణ పరంగా సుస్థిర ప్రగతి సాధన లక్ష్యాలుగా ఈ నూతన పారిశ్రామిక విధానం పని చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. 2020 నుంచి 23 వరకూ ఈ పారిశ్రామిక విధానం అమల్లో ఉంటుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులు, ఇతర మౌలిక సదుపాయల విస్తృత వినియోగంతో పాటు భారీ నుంచి సూక్ష్మస్థాయి పరిశ్రమలకు సమాన అవకాశాలు కల్పించేలా పారిశ్రామిక విధానం రూపొందించామని మంత్రి తెలిపారు.
45 వేల ఎకరాల భూమి బ్యాంకు