కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా పరీక్షల ఫలితాల విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై వివరణ ఇచ్చింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కచ్చితత్వం 67 శాతం మాత్రమేనన్న ఆ శాఖ అధికారులు.. వ్యక్తి శరీరంలో 33 శాతం వైరస్ ఉనికి ఉన్నా నెగెటివ్‌గానే చూపుతాయని తెలిపారు. ఇన్‌ఫెక్టెడ్ వ్యక్తిలో వైరస్ 100 శాతం ఉంటే ఫలితాలు పాజిటివ్‌గా వస్తాయని అన్నారు.
దీపక్‌రెడ్డికి తొలి ఫలితాలు పాజిటివ్ వస్తే వందశాతం ఇన్ఫెక్షన్‌కు గురైనట్టేనన్న వైద్యారోగ్యశాఖ.. రెండో విడత పరీక్షలో నెగిటివ్ రావడానికి ఆయనలో ఇన్ఫెక్షన్ స్థాయి 33 శాతం లోపుగా ఉండటమే కారణమని స్పష్టం చేసింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయితే... వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్టేనని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. సాంకేతిక అంశాలపై స్పందించే ముందు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. అనవసర ఆరోపణల వల్ల వైద్య సిబ్బంది నైతిక స్థైర్యం దెబ్బతింటుందని తెలిపింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం సరికాదని హితవు పలికింది.