ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం భారీగా ఆర్థిక తోడ్పాటును అందించనుంది. ఈ ప్రోత్సాహక మొత్తాన్ని గతంలో రెండు కేటగిరీలుగా అందివ్వగా.. ఈసారి నాలుగు స్లాబుల్లో విభజించింది. జనాభాను బట్టి కనిష్ఠంగా రూ.5 లక్షలు, గరిష్ఠంగా రూ.20 లక్షలు సంబంధిత గ్రామ పంచాయతీకి అందించనుంది. 2001లో మొదటిసారి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో కనిష్ఠంగా రూ.15 వేలు, గరిష్ఠంగా రూ.50 వేలు అందించారు. ఎప్పటికప్పుడు ఈ మొత్తాన్ని పెంచుతూ పోతున్నారు. 2020 మార్చిలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించినప్పుడు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను నాలుగు కేటగిరీల్లో రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా అప్పట్లో ఎన్నికలు జరగనందున ఈ జీవో అమలు కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం అదే జీవోకు కట్టుబడినట్లుగా అవగతమవుతోంది. ఏకగ్రీవాలను ప్రోత్సహించేలా విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు మంగళవారం ఆదేశాలిచ్చారు.
ఏకగ్రీవ పంచాయతీలకు ఆర్థిక ప్రోత్సాహకాలు
19:09 January 26
రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకం ప్రకటిస్తూ ఉత్తర్వులు
ఐదు రాష్ట్రాల్లో ప్రోత్సాహకాలు
పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ గుజరాత్, హరియాణానా, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు సీఎస్ గుర్తుచేశారు. ‘ఏకగ్రీవ పంచాయతీలను కొన్నిచోట్ల ప్రభుత్వాలే దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో వినూత్న విధానాలను ప్రవేశపెడుతున్నారు. గుజరాత్‌లో సమ్రాస్ పథకం కింద ఏకగ్రీవ పంచాయతీలకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నిధులు అందిస్తున్నారు. హరియాణాలోనూ ఇలాంటి విధానమే అమలులో ఉంది. రాష్ట్రంలోనూ పంచాయతీ పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకంతో గ్రామాభివృద్ధికి తోడ్పడాల’ని ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: