ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిమ్మగడ్డ వ్యవహారం: తొలగింపు నుంచి పునరుద్ధరణ వరకు..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఎన్నో మలుపులు.. ఊహించని ట్విస్టులు..! అనూహ్యంగా ఆయన పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం తిరిగి నియమించకుండా.. అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి సుప్రీంకోర్టు తలుపులూ తట్టింది అన్ని అడ్డంకులు దాటుకొని ఎట్టకేలకు రమేష్ కుమార్ ఎస్​ఈసీగా నియమితులు కానున్నారు. నిమ్మగడ్డని తప్పించడానికి... ఏ గవర్నర్ అయితే ఆర్డినెన్స్ ఇచ్చారో.. ఆయనే... పునర్నియామకానికి ఆదేశాలు ఇచ్చారు.

nimmagadda-ramesh-kumar
nimmagadda-ramesh-kumar

By

Published : Jul 22, 2020, 12:37 PM IST

Updated : Jul 22, 2020, 6:18 PM IST

నిమ్మగడ్డ వ్యవహారం: తొలగింపు నుంచి తిరిగి నియమించేదాకా....

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్​ను పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం తిరిగి ఆయనను నియమించకుండా అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలే చేసింది. అయితే అవేమీ ఫలించలేదు. నిమ్మగడ్డను తిరిగి ఎస్​ఈసీగా నియమించమంటూ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. రమేష్ కుమార్​ను తిరిగి నియమించే ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి కారణంగా.. స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ప్రత్యేక ఆర్డినెన్స్​ తీసుకొచ్చి పదవి నుంచి తొలగించింది. దీనిపై రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడం.. హైకోర్టు ఆర్డినెన్సు​ను రద్దు చేసి.. రమేష్ కుమార్​ను తిరిగి నియమించాలని చెప్పడం.. దీనిపై ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడం.. అక్కడ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించడం జరిగాయి. తమ తీర్పు అమలు చేయడం లేదని కోర్టు ధిక్కరణ నేరం కింద పరిగణిస్తూ ఏపీ హైకోర్టు.. ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రమేష్ కుమార్​ గవర్నర్​ను కలవాల్సిందిగా సూచించింది. కోర్టు సూచనలతో రమేష్ కుమార్ గవర్నర్​ను కలిసిన తర్వాత ఈ ఆదేశాలు వచ్చాయి.

వివాదం మొదలైంది ఇక్కడే...

కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్​ఈసీ రమేశ్ కుమార్ మార్చి 15న ప్రకటించారు. ఆయన నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రభుత్వంలోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. తీవ్ర పదజాలంతో విమర్శల వర్షం గుప్పించారు. ప్రభుత్వాన్ని, వైద్యారోగ్యశాఖను సంప్రదించకుండా ఎస్‌ఈసీ ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారు. ఎస్​ఈసీగా ఉన్న రమేష్ ​కుమార్​ను ఆ పదవి నుంచి ఎలా తొలగించాలో తమకు తెలుసంటూ...ప్రభుత్వ సలహాదారు సజ్జల, వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా చేశారు.

పదవీకాలం తగ్గిస్తూ ఆర్డినెన్స్​..

నిమ్మగడ్డ రమేశ్​ను ఎస్​ఈసీ పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్​ ప్రయోగించింది. ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్-200లో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చింది. అందులోని వివరాలను పొందుపరుస్తూ జీవో-617 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు మాత్రమే ఎస్​ఈసీ పదవికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఐదేళ్ల పదవీకాలం మూడేళ్లకు కుదించిన ప్రభుత్వం... మూడేళ్ల పాటు ఎన్నికల కమిషనర్‌గా పని చేసినవారు మరో మూడేళ్లు కొనసాగే వెసులుబాటు కల్పించింది. ఆరేళ్లకు మించి పదవిలో కొనసాగేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం అర్ధంతరంగా ముగిసింది. ఆర్డినెన్స్‌, నోటిఫికేషన్‌ ప్రకారం ఆయన పదవీకాలం ముగిసిందంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకానికి చేసిన సవరణ ఆర్డినెన్స్‌కు సంబంధించి కూడా ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.

ప్రత్యేక ఆర్డినెన్సు...

ఎస్​ఈసీ పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గవర్నర్‌ను కలిసి ఈ అంశాలను వివరించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం, ఉత్తర్వుల జారీ.. చకచకా జరిగిపోయాయి. ఇక కొత్త ఎస్​ఈసీగా పొరుగు రాష్ట్రానికి చెందిన విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ పేరును సూచిస్తూ... గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. వెంటనే ఆయన ఆమోదముద్ర వేశారు.

కోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ..

ఎస్​ఈసీ పదవి నుంచి తనని తొలగించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్​ హైకోర్టును ఆశ్రయించారు. తనను దురుద్దేశంతోనే బాధ్యతల నుంచి తప్పించారని పిటిషన్​లో పేర్కొన్నారు. నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఆర్డినెన్స్ తెచ్చామన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదని వివరించారు. ఎస్​ఈసీ పదవీ కాలంపై ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌కు హైకోర్టులో భాజపా నేత కామినేని శ్రీనివాస్​ రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని అఫిడవిట్​లో పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్, పదవీకాలానికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని ప్రస్తావించారు.

ఎస్​ఈసీ విషయంలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టులో ప్రభుత్వం వాదించింది. కొత్త ఎస్‌ఈసీ జస్టిస్‌ వి.కనగరాజ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ చట్ట నిబంధనలకు లోబడి ఉందన్నారు. ఇంప్లీడ్‌ పిటిషనర్ల తరఫున న్యాయవాదులు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, ఇతర పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, ఎ.సత్యప్రసాద్‌, పి.వీరారెడ్డి ప్రతి సమాధానంగా(రిప్లై) వాదనలు వినిపించారు. ''ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అత్యవసర పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వం తన చర్యను ఎలా సమర్ధించుకుంటుందని ప్రశ్నించారు. రమేష్ ‌కుమార్‌ను ఎస్‌ఈసీగా తొలగించడం కోసమే ఆర్డినెన్స్‌ తెచ్చారన్నారు. ఆర్డినెన్స్‌, తదనంతర జీవోలను రద్దు చేయాలని'' కోరారు.

హై కోర్టు తీర్పు..

ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు..తీర్పును వెలువరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆర్డినెన్స్​ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఎస్​ఈసీ నియామకం చెల్లదంటూ చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్​ కుమార్ నే కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విధుల్లో చేరిన రమేశ్ కుమార్...కోర్టు ఆదేశాలకనుగుణంగా ఎస్​ఈసీగా తిరిగి బాధ్యతలు చేపడుతున్నట్లు ప్రకటించారు.

మళ్లీ హైడ్రామా...!

ఎస్​ఈసీగా రమేష్ కుమార్ ను నిర్మించాలని హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా హైడ్రామా నడిచింది. ప్రభుత్వం నియమించకుండా ఎస్ఈ​సీగా రమేష్ కుమార్ తనను తాను ప్రకటించడానికి వీల్లేదంటూ వాదించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్-200ను సవరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ పై.. విచారణ జరిపే అంశం న్యాయస్థానాల పరిధిలోకి రాదని.. పిటిషన్ లో పేర్కొంది. ప్రభుత్వానిది విధానపర నిర్ణయమని.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది.

రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలా..?

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు తగవని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది. ఆర్డినెన్స్‌ వెనక ప్రభుత్వ ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి ఆర్డినెన్స్ ఎలా ఆమోదిస్తారని.. రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నవారితో ఆటలు ఆడుకోవద్దని పేర్కొంది.

హైకోర్టు ఆగ్రహం

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయటం లేదంటూ ఈలోగా నిమ్మగడ్డ మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ గా పరిగణిస్తామని చెప్పింది. గవర్నర్ ను కలవాలని నిమ్మగడ్డకు సూచించింది.

గవర్నర్ ఆదేశాలు

హైకోర్టు సూచనలు అనుసరించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మూడు రోజుల కిందట గవర్నర్ ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం.. తన నియామకానికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులను పాటించడంలేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్​ఈసీగా రమేష్ కుమార్ ను పునర్నియమించాలని.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లేఖ రాశారు.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలంటూ సీఎస్​కు గవర్నర్ ఆదేశం

Last Updated : Jul 22, 2020, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details