Farmers Padayatra in Nellore Today: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అంటూ అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర 27వరోజుకు చేరింది. నెల్లూరులో జెట్టి శేషరెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద రాత్రి బసచేసిన రైతులు.. వెంకటేశ్వర స్వామికి పూజలు చేసిన తర్వాత ఈరోజు పాదయాత్ర ప్రారంభించారు.
భారీ వర్షంలోనూ కొనసాగుతున్న యాత్ర...
నెల్లూరులో భారీ వర్షం కురుస్తోంది. వర్షంలోనూ రాజధాని రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. వర్షంలో తడుస్తూ జై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేస్తున్నారు. మహాపాదయాత్రకు వివిధ ప్రజాసంఘాలు మద్దతుగా వచ్చారు. నెల్లూరు బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వీరితో పాటు నెల్లూరు నాయిబ్రాహ్మణుల సంఘం కాడా పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. అంబాపురంలోని శాలివాహన ఫంక్షన్ హాల్ వరకూ ఇవాళ 12 కిలోమీటర్ల మేర నడవనున్నారు. జగన్ ఇచ్చే మంత్రి పదవులకు ఆశపడి.. తమను అవమానించొద్దని.. మహిళలు వైకాపా ఎమ్మెల్యేలకు సూచించారు.
అడుగడుగున నీరాజనం..
26వ రోజు నెల్లూరు నగరంలోని శెట్టిగుంటరోడ్డు, వివర్స్‌కాలనీ, లక్ష్మీపురం, స్టోన్‌హౌస్‌పేట, ఆత్మకూరుబస్టాండ్, పూలే విగ్రహం, విజయమహాల్‌గేటు, గాంధీబొమ్మ సెంటర్, వీఆర్‌సీ, హరినాథపురం మీదగా యాత్ర సాగింది. దారి పొడవునా వివిధ వర్గాలు, సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. నెల్లూరు చేనేత సమాఖ్య ప్రతినిధులు మహిళలతో కలిసి నడిచారు. నేతన్నలు పాదయాత్ర చేస్తున్న మహిళలకు చీరలు పెట్టారు. కోవూరు ప్రాంతంలోని వరద ముంపు ప్రాంతాల మీదుగా వెళ్తున్న రైతులు..ఆ చీరల్ని అక్కడ నిరాశ్రయులకు పంచిపెట్టి మానవత్వం చాటారు.
రాజధాని రైతుల మహా పాదయాత్రకు నెల్లూరు పట్టణంలో తెలుగుదేశం నేతలు మద్దతు తెలిపారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి , జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ లు రైతుల తో అడుగు కలిపారు. మూడు రాజధానుల బిల్లుతో పాటు... ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు రాష్ట్ర ప్రజలందరి మద్దతూ ఉందని.. అంతిమ విజయం వారిదేనని ధైర్యం నింపారు. నెల్లూరులో రాజధాని రైతులకు ట్రన్స్‌జెండర్లు హారతులిచ్చి, పాదయాత్రకు మద్దతు తెలిపారు.