అమరావతిలోనే రాజధాని కొనసాగించాల్సిన ఆవశ్యకతను తెలియజేసేందుకు దిల్లీ వెళ్లిన మహిళా ఐకాస నాయకులు...పలు పార్టీల ఎంపీలను కలిశారు. ఎంపీ రఘురామకృష్ణరాజుతో కలిసి...టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌ని కలిశారు. ఏపీ ప్రభుత్వ తీరును వివరించి వినతి పత్రం అందించారు. ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తే విషయంపై తమ పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
శివసేన ఎంపీ అరవింద్ సావంత్, కాంగ్రెస్ ఎంపీ కోడికొన్నిల్ సురేశ్‌ను కలిసి తమ గోడు చెప్పారు. రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వివరించారు. అమరావతి ఏర్పాటుపై ఆనాడు దిల్లీ నేతలంతా సుముఖత వ్యక్తం చేశారని ఎంపీ సురేశ్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టి రాజధానికి పునాదులు వేసిందన్నారు. సింగపూర్ లాంటి రాజధాని నిర్మాణం జరుగుతుందని అంతా భావించారని వ్యాఖ్యానించారు. దాదాపు ఏడాదిగా రైతులు చేస్తున్న ఆందోళన తమకు తెలుసునని...రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సురేశ్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తుతామని హామీ ఇచ్చారు.