ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లైవ్​ అప్​డేట్స్: 11వ రోజూ.. రాజధాని రైతుల ఆందోళనలు - live

amaravathi-farmers-protest-in-ap
amaravathi-farmers-protest-in-ap

By

Published : Dec 28, 2019, 9:18 AM IST

Updated : Dec 28, 2019, 7:47 PM IST

12:11 December 28

రైతులకు తెలుగు యువత సంఘీభావం

రాజధాని రైతులకు కృష్ణా జిల్లా తెలుగు యువత నేతలు సంఘీభావం తెలిపారు. దేవినేని చందు నేతృత్వంలో రైతులను కలిశారు. దీక్షలు,ఆందోళనలకు మద్దతు తెలిపారు.

12:02 December 28

తుళ్లూరులో రైతుల ఆందోళనకు భాజపా మద్దతు

తుళ్లూరులో రైతుల ఆందోళనకు భాజపా నేతలు శ్రీనివాసరాజు, రమేష్ నాయుడు మద్దతు తెలిపారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. రైతుల పోరాటానికి తమ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు.. తుళ్లూరులో రైతులు మోకాళ్లపై నిలబడి.. ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

11:47 December 28

సచివాలయం వద్ద రైతులు, మహిళల బైఠాయింపు

సచివాలయం వద్ద రహదారిపై రైతులు, మహిళల బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఐనవోలు నుంచి మందడం బయల్దేరిన రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

11:46 December 28

కాకుమానులో తెదేపా నాయకుల నిరసన

గుంటూరు జిల్లా కాకుమానులో తెదేపా నాయకుల నిరసన చేశారు. రాజధానిగా అమరావతిగా కొనసాగించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పొట్టిశ్రీరాములు,తెలుగుతల్లి విగ్రహాలకు నివాళులర్పించారు.

10:57 December 28

గుంటూరులో రాజధాని ఐకాస ధర్నా

గుంటూరు లాడ్జి సెంటర్ వద్ద అమరావతి రాజకీయ ఐకాస ధర్నాకు దిగింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ధర్నాలో తెదేపా,జనసేన,వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రైతుల ఆందోళనలు గుర్తించాలని కోరారు.

10:23 December 28

మందడంలో రహదారిపై రైతుల బైఠాయింపు

మందడంలో 11వ రోజు రైతుల ఆందోళన జరుగుతోంది. రహదారిపై బైఠాయించిన రైతులను.. పోలీసులు వారించారు. అయినా అక్కడే రహదారిపైనే బైఠాయించిన రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు.

10:22 December 28

ఎర్రబాలెంలో రహదారిపై మహిళలు, రైతుల బైఠాయింపు

మంగళగిరి మండలంలో రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతిపై స్పష్టమైన ప్రకటన చేయాలని రాజధాని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎర్రబాలెంలో రహదారిపై మహిళలు, రైతులు బైఠాయించారు. కిష్టాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

10:21 December 28

తుళ్లూరులో రహదారిపై రైతుల మహాధర్నా.. వంటావార్పు

తుళ్లూరులో రహదారిపైనే రైతులు మహా ధర్నా నిర్వహిస్తున్నారు. వంటావార్పు చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నినాదాలు చేస్తూ.. ఆందోళన కొనసాగిస్తున్నారు.

10:19 December 28

'ఇంకా ఎన్ని కమిటీలు వేస్తారు? మీకు చట్టాలు తెలియవా?'

రాజధాని మంటలు చల్లారడం లేదు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో... పదకొండో రోజూ ఉద్ధృతంగా రైతులు, ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో కమిటీ వేస్తారన్న వార్తలపై.. ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 29 గ్రామాల ప్రజలతో జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఇచ్చిన గెజిట్ లోనూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. అని ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అయినా.. ఇంకా ఎన్ని కమిటీలు వేస్తారని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పోరాటాన్ని ఆపేది లేదని.. ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని డిమాండ్ చేశారు. చట్టాలు తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. తమ త్యాగాలకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు ఇదేనా అని నిలదీశారు.

07:40 December 28

లైవ్​ అప్​డేట్స్: 11వ రోజూ.. రాజధాని రైతుల ఆందోళనలు

రాజధాని రైతుల ఆందోళనలు 11వ రోజుకు చేరాయి. మందడంలో రైతులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. వెలగపూడిలో రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు. తుళ్లూరులో వంటావార్పు, మహా ధర్నా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల్లో రైతుల నిరసనలు  తెలుపుతున్నారు.  కృష్ణా-గుంటూరు జిల్లాల్లో రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టనున్నారు.

Last Updated : Dec 28, 2019, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details