పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే చిక్కీ (పల్లిపట్టీలు) టెండర్ల ఖరారుపై ఆరోపణలు వినవస్తున్నాయి. వాస్తవానికి రివర్స్ టెండర్ల విధానంలో ప్రభుత్వానికి డబ్బులు ఆదా కావాల్సి ఉండగా.. రూ.14 కోట్లకుపైగా భారం పడుతోంది. అక్షయపాత్ర, మరో సంస్థ తక్కువ ధరకు సరఫరా చేస్తామన్నా పట్టించుకోకుండా ఎక్కువ ధరకు గుత్తేదార్లకు కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన) పథకం కింద విద్యార్థులకు పోషకాహారంలో భాగంగా వారానికి మూడు రోజులు చిక్కీలను అందిస్తున్నారు.
జులైలో టెండర్లు పిలవగా గుత్తేదారులు ముందుకు రాకపోవడం, ఇతర కారణాలతో వాటిని రద్దు చేశారు. ఆగస్టులో నాలుగు జోన్లుగా విభజించి రివర్స్ టెండర్ విధానం (రివర్స్ ఆక్షన్)లో పిలిచారు. ప్రభుత్వ అంచనా ధరగా కిలో రూ.135గా నిర్ణయించారు. దీనికన్నా తక్కువ ధరకు అనుమతించాలి. లేదా అంచనాపై 5 శాతం (రూ.141.75కు) మించకుండా ఇవ్వొచ్చు. అయితే మొత్తం 10శాతం ఎక్కువ ధరకు.. అంటే రూ.142.50 నుంచి రూ.149.20 వరకు ఖరారు చేశారు.
ప్రస్తుతం అక్షయపాత్రకు, ఇతర మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కిలో రూ.135 చొప్పునే చెల్లిస్తున్నారు. విశాఖ, విజయనగరం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు ఈ సంస్థ సరఫరా చేస్తోంది. మరో సంస్థ రూ.120కే సరఫరా చేస్తామని లేఖలు ఇచ్చినా పట్టించుకోలేదు. ప్రకాశం జిల్లాలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన టెండర్లలో కేజీ చిక్కీ రూ.135కు ఖరారు చేశారు.