ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Phone number link with Aadhar: ఆధార్‌తో ఫోన్‌ నంబర్‌ అనుసంధానం ఇక సులభం..! - ఆధార్‌ కార్డు తాజా వార్తలు

ఇకపై ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కోసం అప్​డేట్ కోసం పోస్టుమ్యాన్‌కు కబురు పెడితే చాలు. ఆయనే మీ ఇంటి వద్దకు వచ్చి సరిచేస్తారు. ఈ తరహా సేవలను జూన్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ తపాలా శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఆధార్‌ సీడింగ్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పోస్టల్ అధికారులు వెల్లడించారు.

Adhaar services
ఆధార్‌తో ఫోన్‌నంబర్‌ అనుసంధానం

By

Published : Jul 24, 2021, 8:50 AM IST

సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్‌ కార్డుతో ఫోన్‌నంబరు అనుసంధానం తప్పనిసరి. దీని కోసం చాలా మంది ఇటీవల ఆధార్‌ సీడింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఇకనుంచి ఆధార్‌ కార్డులో ఫోన్‌నంబరు అప్‌డేట్‌ చేయించుకునేందుకు సీడింగ్‌ కేంద్రం వరకు వెళ్లనక్కర్లేదు. పోస్టుమ్యాన్‌కు కబురు పెడితే ఆయనే వచ్చి అవన్నీ మీ ఇంటి వద్దే చేస్తారు. రూ.50 చెల్లించి ఈ సేవలను పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ తపాలా శాఖ జూన్‌ నుంచి ఈ తరహా సేవలను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది.

రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 5లక్షల మంది ఈ సేవలు పొందారు. భీమవరం, ఏలూరు, గుడివాడ, నెల్లూరు, విజయనగరం తపాలా డివిజన్లలో ఈ సేవలు ఇప్పటివరకు ఎక్కువగా అందాయి. పోస్టుమ్యాన్ల వద్ద ఒక మొబైల్‌ అప్లికేషన్‌ ఉంటుంది. దాని సాయంతో వారు వినియోగదారుల మొబైల్‌ నంబరును ఆధార్‌ కార్డుకు అనుసంధానిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల సాయంతో గ్రామీణ తపాలా సేవకులు వినియోగదారులను చేరుకుంటున్నారు. తమకున్న సమాచారం మేరకు రాష్ట్రంలో ఇంకా సుమారు 1.92 కోట్ల ఆధార్‌ కార్డుల ఫోన్‌నంబర్లు అప్‌డేట్‌ చేయాల్సి ఉందని ఏపీఎంజీ సుధీర్‌బాబు తెలిపారు.

ఏప్రిల్‌ ఒకటినుంచే మొదలుపెట్టాం

ఆధార్‌కు ఫోన్‌నంబరు అనుసంధానం సేవలను పైలట్‌ ప్రాజెక్టుగా గుడివాడ, భీమవరం ప్రాంతాల్లో ఏప్రిల్‌ ఒకటినుంచే మొదలుపెట్టాం. జూన్‌ ఒకటినుంచి రాష్ట్రవ్యాప్తం చేశాం. ప్రస్తుతం ఫోన్‌నంబరు అప్‌డేట్‌ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాం. ఆధార్‌ సీడింగ్‌ కేంద్రాల వద్ద అందే చిరునామా మార్పు, వివరాల్లో దోషాలు సరిచేయడం వంటి అన్ని సేవలు తపాలాశాఖ ద్వారా ప్రజలకు ఇంటి వద్దే అందుబాటులోకి వస్తున్నాయి. ఐదేళ్లలోపు పిల్లలకు రుసుము లేకుండా ఆధార్‌ నమోదు చేయడం వంటి సౌకర్యాలూ అందుతాయి. _ ఏపీ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ డా.ఎం.వెంకటేశ్వర్లు.

ఇదీ చదవండి:

KTR Birthday: వీలైతే సాయం చేయండి.. వేడుకలు వద్దు..!

High Court on Jagan Govt: 'వాళ్లకు కల్పిస్తున్న సౌకర్యాలు.. హై కోర్టు న్యాయమూర్తులకూ లేవు'

ABOUT THE AUTHOR

...view details