‘అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్‌యాప్ సభ్వత్యం నెలకు రూ.129. అయితే రూ.20 ఇస్తే ఓటీపీ చెబుతాం.. తీసుకోండి.. ఆనందించండి. నెట్‌ఫ్లిక్స్ రెండు నెలల చందా రూ.25కే ఇస్తాం..’ అంటూ సైబర్ నేరస్థులు ప్రచారం చేసుకుంటున్నారు.. టెలిగ్రామ్ మెసెంజర్‌లో వీరిస్తున్న ప్రకటనలు చూసి వందలసంఖ్యలో యువకులు, విద్యార్థులు టెలిగ్రాం మెసెంజర్ బృందంలో సభ్యులై రూ.20, రూ.25 నగదు బదిలీ చేసుకుని ఓటీపీలు తీసుకుంటున్నారు. ఇంతేకాదు డిస్నీ, హాట్‌స్టార్, యూట్యూబ్ ప్రీమియం, సోనీలైవ్, జీఫైవ్ ఇలా వినోద ఛానెళ్లకు సంబంధించిన నెల, ఏడాది చందాలకు తక్కువ ధరలకే ఇస్తున్నారు. ఒక యువతిని వేధించిన కేసులో నిందితుడిని విచారిస్తున్న క్రమంలో సైబర్‌క్రైమ్ పోలీసులు అతడి ఫోన్‌ను పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వేధింపుల కాల్‌తో బయటపడ్డ అతిపెద్ద సైబర్‌క్రైం..! - cybercrime latest news
యువతిని వేధిస్తున్నాడని వచ్చిన ఓ కేసులో నిందితున్ని విచారిస్తున్న పోలీసులకు విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. ఆ యువకుడు వాడిన సిమ్ కార్డు... గుట్టుగా సాగుతున్న అతిపెద్ద సైబర్ క్రైంను బయటపడేసింది.
టెలిగ్రామ్ మెసెంజర్‌లో ‘ఓటీపీ బయ్యర్స్, సెల్లర్స్’ పేరుతో ఒక బృందాన్ని సైబర్ నేరస్థులు నిర్వహిస్తున్నారు. టెలిగ్రామ్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారు ఓటీపీ బయ్యర్స్, సెల్లర్స్ బృందంలో సభ్యులుగా చేరేందుకు వీలుంది. ‘జాయిన్’ అని క్లిక్ చేయగానే స్వాగతం అంటూ సందేశం వస్తుంది. సభ్యులుగా చేరినవారు వినోద ఛానళ్లు వీక్షిస్తామంటే ఫలానా ఛానల్ పేరును పంపి రూ.20 బదిలీ చేస్తే క్షణాల్లో ఓటీపీ వస్తుంది. అమెజాన్ ప్రైమ్ మొబైల్‌యాప్‌లోకి ప్రవేశించి ఓటీపీ నమోదు చేయగానే ఎంచక్కా అందులోని సినిమాలను చూడొచ్ఛు ఎంత మంది రూ.20 పంపితే అంతమందికీ ఓటీపీలు పంపుతున్నారు. ఇదంతా ఎవరు, ఎలా చేస్తున్నారో తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. పూర్తి సమాచారం ఇవ్వాలంటూ టెలిగ్రాం సంస్థను అభ్యర్థించారు.
వర్చువల్ సిమ్‌కార్డులూ...
వినోద ఛానళ్ల వీక్షణాన్ని తక్కువ ధరలకే అందిస్తున్న సైబర్ నేరస్థులు వర్చువల్ అవసరమైనవారికి వర్చువల్ సిమ్‌కార్డులనూ(అసలు సిమ్‌కార్డు నిందితుల వద్ద ఉంటుంది.) సమకూర్చుతున్నారని పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ యువకుడు.. ఒక యువతిని వేధించేందుకు నిందితుల నుంచి వర్చువల్ సిమ్‌కార్డు తీసుకున్నాడు. నెలరోజుల నుంచి వేధిస్తున్నాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా తొలుత పోలీసులకు ఎవరన్నది తెలియలేదు. సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని గుర్తించారు. విచారించగా ఓటీపీ బయ్యర్స్, సెల్లర్స్‌తోపాటు వర్చువల్ సిమ్‌కార్డుల విషయం బయటకు వచ్చింది. వర్చువల్ నంబర్లను వినియోగిస్తున్న వారు ఎవరికీ తెలియకుండా ప్రైవేటు సంభాషణల కోసం, గిట్టనివారిని వేధించేందుకు, బెదిరించేందుకు వాడతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వర్చువల్ నంబర్లను వాడుతున్న వారిని గుర్తించడం కష్టమే. ఎందుకంటే ఆ ఫోన్ నంబర్ అమెరికా, దుబాయ్, షాంఘై అంటూ వేర్వేరు ప్రాంతాలను చూపిస్తోంది.