అలుపెరుగని అమరావతి ఉద్యమానికి 300 రోజులు అక్కడ అందరి లక్ష్యం ఒక్కటే అమరావతిని కాపాడుకోవటం. రాజధానిని తరలించకుండా అడ్డుకోవటం. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, ప్రజలు సహా విపక్ష రాజకీయ పార్టీలు, సంఘాల అలుపెరగని పోరాటం మొదలై ఇవాళ్టికి 300 రోజులైంది. 2019 డిసెంబరు 17న శాసనసభలో ముఖ్యమంత్రి 3 రాజధానుల ఆలోచన బయటపెట్టిన మరుసటిరోజు నుంచే రాజధాని రైతులు ఉద్యమబాట పట్టారు.
డిసెంబరు 18న వెలగపూడిలో తొలి దీక్షా శిబిరం మొదలైన నాటినుంచి రైతు ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి అకుంఠిత దీక్షతో.. పోరాడుతూనే ఉన్నాయి. దిల్లీ వరకు ఉద్యమ నినాదం వినిపించారు. పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని లాఠీ దెబ్బలూ తిన్నారు. జైళ్లకూ వెళ్లారు. కరోనాకు వెరవకుండా వివిధ రూపాల్లో పోరాడుతూనే ఉన్నారు.
భూములిచ్చిన తమపై నేతల అవమానకర మాటల్ని తట్టుకుంటూ పోరాటం సాగిస్తున్నామంటూ... రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై కూడా ఎన్ని కేసులు పెట్టినా అమరావతి సాధించేవరకూ వెనకడుగు వేయబోమని తేల్చి చెబుతున్నారు.
అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో అమరావతికి జగన్ సమ్మతించాకే భూములిచ్చినట్లు... రైతులు గుర్తుచేశారు. కొన్నినెలల కిందట సీఆర్డీయే చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదముద్రతో ఆందోళన ఉద్ధృతరూపం దాల్చింది. ఆ రెండు చట్టాలపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. కోర్టుల్లో తమకు న్యాయం జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండీ... రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న నారా లోకేశ్