వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయంలో... పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని జగన్ అన్నారు. అన్ని వర్గాలకూ ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక రూపొందించామనీ.. అధికారంలోకి వస్తే కచ్చితంగా హామీలన్నింటినీ అమలు చేస్తామనీ తెలిపారు. ఈ ప్రణాళిక గెలుపు కోసం కాదనీ.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలన్నదే తన ధ్యేయమనీ స్పష్టం చేశారు. ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయాల్సిన బాధ్యత ఆయా పార్టీలకు ఉంటుందనీ... అవి అమలుచేయకపోతే ప్రజలు నిలదీసే పరిస్థితి రావాలన్నారు.
రైతులపై వరాల జల్లు
పాదయాత్రలో ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచామనీ... నవరత్నాల్లో రైతులకు చెప్పిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. ఏటా రూ. 12500 చొప్పున రైతులకు ఇస్తామని చెప్పారు జగన్. రైతులు చెల్లించాల్సిన పంట బీమా ప్రీమియం తామే చెల్లిస్తామన్నారు. రైతులకు ఉచితంగా బోర్లు... 3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని తెలిపారు.