కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు లలిత. పోటీ పరీక్షలలో విజయం సాధించి ఎస్సై కొలువు సాధించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని కడప జిల్లా బద్వేలు గ్రామీణ ఎస్సైగా నియమితులయ్యారు. సాధారణ కుటుంబంలో పుట్టి.. అచంచల దీక్షతో ప్రభుత్వ కొలువు సాధించిన ఎస్సై లలిత..ఎందరో యువతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
లలిత స్వస్థలం కర్నూలు. తల్లిదండ్రులు దాసప్ప, లక్ష్మీదేవి. వీరికి ఐదుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలలో రెండో సంతానం లలిత. దాసప్ప మెకానిక్ వృత్తే ఆ కుటుంబానికి ఆధారం. చాలీచాలని సంపాదనలోనూ పిల్లలందరినీ విద్యావంతులు చేశారు. తండ్రి పడుతున్న కష్టాన్ని అర్ధం చేసుకున్న లలిత.. కుటంబానికి ఆసరా నిలవాలనుకుంది. పట్టుదలతో పోటీపరీక్షలకు సిద్ధమై...ఎస్సై కొలువు సాధించింది.